‘చమురు-వజ్ర’ బంధం

‘చమురు-వజ్ర’ బంధం - Sakshi


పుతిన్ పర్యటనలో భారత్ కంపెనీలతో కీలక ఒప్పందాలు

పదేళ్లపాటు క్రూడ్ దిగుమతి చేసుకోనున్న ఎస్సార్ గ్రూప్

10 బిలియన్ డాలర్ల డీల్...

ఎస్సార్‌కు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్న రష్యా బ్యాంక్...

2 బిలియన్ డాలర్ల వజ్రాల దిగుమతికి 12 కంపెనీల కాంట్రాక్టు


 

న్యూఢిల్లీ: చిరకాల మిత్రదేశాలైన రష్యా, భారత్‌ల మధ్య వాణిజ్య, వ్యాపారం సంబంధాల్లో ‘చమురు-వజ్ర’ బంధానికి తెరలేచింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా ముడి చమురు(క్రూడ్), వజ్రాల దిగుమతికి వీలుగా కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌కు చెందిన ఎస్సార్ గ్రూప్... రష్యా నుంచి క్రూడ్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల చొప్పున పదేళ్ల పాటు క్రూడ్‌ను దిగుమతి చేసుకునేందుకు రష్యా చమురు దిగ్గజం ఓఏఓ రాస్‌నెఫ్ట్‌తో డీల్ ఓకే అయింది.దీని విలువ 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62,000 కోట్లు). భారత్ ఆయిల్ కంపెనీలు కుదుర్చుకున్న అతిపెద్ద ఆయిల్ డీల్స్‌లో ఒకటిగా కూడా దీన్ని చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ డీల్ అమల్లోకి రానుందని...  సముద్రమార్గం ద్వారా క్రూడ్‌ను సరఫరా చేయనున్నట్లు  ఓఏఓ రాస్‌నెఫ్ట్ చైర్మన్ ఇగర్ ఇవనోవిచ్ సెచిన్ పేర్కొన్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌ల సమక్షంలో ఎస్సార్ సహ వ్యవస్థాపకుడు శశి రూయా, సెచిన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.4,05,000 బ్యారెల్స్ రోజువారీ సామర్థ్యంతో గుజరాత్‌లోని వడినార్‌లో ఎస్సార్ భారీ రిఫైనరీని నిర్వహిస్తోంది. కాగా, వెనెజువెలా నుంచి రోజుకు 3-4 లక్షల బ్యారెళ్ల(బీపీడీ) క్రూడ్ దిగుమతి కోసం గతంలో కుదుర్చుకున్న పదిహేనేళ్ల ఒప్పందం ఇప్పటిదాకా అతిపెద్దదిగా నిలుస్తోంది. కాగా, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కిస్తుందని సెచిన్ వ్యాఖ్యానించారు. భారత్‌కు ఇంధన భద్రతను కూడా కల్పిస్తుందన్నారు. కాగా, ఎస్సార్ రిఫైనరీలకు దీర్ఘకాలంపాటు ఎలాంటి ఆటం కం లేకుండా క్రూడ్ సరఫరా అయ్యేలా ఈ ఒప్పందం భరోసా కల్పిస్తుందని శశి రూయా పేర్కొన్నారు.ఎస్సార్‌కు బిలియన్ డాలర్ల రుణం...

ఎస్సార్ గ్రూప్ కార్పొరేట్, ప్రాజెక్టు అవసరాల కోసం రష్యాకు చెందిన వీటీబీ బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,200 కోట్లు) రుణం ఇవ్వడానికి అంగీకరించింది. మోదీ, పుతిన్‌ల సమక్షంలోనే వీటీబీ చైర్మన్ ఆండ్రే కోట్సిన్, ఎస్సార్ శశి రూయాలు అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశారు.భారత్‌కు రష్యా వజ్రాలు....

రష్యా నుంచి వచ్చే మూడేళ్లలో 2.1 బిలియన్ డాలర్ల విలువైన ముడి వజ్రాలను భారత్ దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు రష్యా డైమండ్ మైనింగ్ దిగ్గజం అల్రోసాతో 12 భారతీయ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పుతిన్, మోదీ గురువారమిక్కడ ప్రారంభించిన ప్రపంచ వజ్రాల సదస్సు సందర్భంగా ఈ డీల్‌పై సంతకాలు జరిగాయి. కిరణ్ జెమ్స్, ఆసియన్ స్టార్, రోసీ బ్లూ ఇండియా తదితర కంపెనీలు విడివిడిగా మొత్తం 12 కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్ విపుల్ షా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఉత్పత్తి దేశంగా రష్యా నిలుస్తోంది. మరోపక్క, ముడి వజ్రాలను సానపట్టే విషయంలో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉంది.రష్యా దిగుమతులవల్ల అంతర్జాతీయ ట్రేడింగ్ హబ్స్‌కు చెల్లిస్తున్న భారీ కమిషన్ ఆదా అవుతుందని ముంబైకి చెందిన రోసీ బ్లూ డైమండ్ ఎండీ రసెల్ మెహతా చెప్పారు. ప్రస్తుతం భారత్ ముడి వజ్రాల కోసం దుబై, ఆంట్వెర్ప్, బెల్జియం వంటి అంతర్జాతీయ హబ్‌లపై ఆధారపడుతోంది. కాగా, ఈ డీల్ కారణంగా ఆయా దేశాలపై రష్యా పైచేయి సాధించేందుకు కూడా దోహదం చేయనుంది. కాగా, భారత్‌ను డైమండ్ హబ్‌గా మార్చేం దుకు వీలుగా భారత్‌తో నేరుగా వ్యాపారాన్ని నిర్వహించాలని రష్యా మైనింగ్ కంపెనీలను సదస్సు సందర్భంగా మోదీ ఆహ్వానించారు. ఈ రంగంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు నిబంధనలను సరళతరం చేయాలని పుతిన్‌ను కోరారు.2025కల్లా ద్వైపాక్షిక వాణిజ్యం

30 బిలియన్ డాలర్లకు....ఇరు దేశాల లక్ష్యమిది..


న్యూఢిల్లీ: వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేదిశగా భారత్, రష్యాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉమ్మడిగా చమురు-గ్యాస్ రంగంలో అన్వేషణ, పెట్రోలియం ప్లాంట్ల ఏర్పాటు, పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టాలని.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్మార్ట్ సిటీల ఏర్పాటులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని కూడా నిర్దేశించుకున్నాయి. పుతిన్ పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘చమురు-గ్యాస్ అన్వేషణ, ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టులు, సరఫరా విషయంలో హైడ్రోకార్బన్ కంపెనీల మధ్య విస్తృత భాగస్వామ్యం నెలకొల్పాలి.రష్యాలో కొత్త చమురు-గ్యాస్ క్షేత్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భారతీయ కంపెనీలు మరింత పాలుపంచుకోవాలి. ఇరు దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ పెట్రోకెమికల్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంపై దృష్టిపెట్టాలి. భారత్, రష్యాల మధ్య చమురు-గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ వ్యవస్థ నిర్మాణానికిగల అవకాశాలను అధ్యయనం చేయా లి’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. భారత్ తలపెట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తయారీ రంగంలో విస్తృత అవకాశాలను రష్యా అందిపుచ్చుకోవాలని తెలిపింది. ఇరు దేశాల్లో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని మోదీ, పుతిన్ ఆకాం క్షించారు. కాగా, 2025 నాటికి ఇరే దేశాల కంపెనీల ఉమ్మడి పెట్టుబడులను ద్వైపాక్షిక ప్రాతిపదికన  15 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్దేశించారు.అడ్డంకులు తొలగిస్తాం: పుతిన్, మోదీ హామీ

న్యూఢిల్లీ: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణి జ్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపడతామని పుతిన్, మోదీలు ఇరు దేశాల కార్పొరేట్ దిగ్గజాలకు గురువారం హామీనిచ్చారు. భారత్ పర్యటన సందర్భంగా పుతిన్ అక్కడి టాప్ వ్యాపారవేత్తలతో కూడి అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని వెంటతీసుకొచ్చారు. గురువారం జరిగిన సమావేశంలో భారత్‌కు సంబంధించి ఎస్సార్ గ్రూప్ సారథులు శశి, రవి రూయా, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఎల్‌అండ్‌టీ చీఫ్ ఏఎం నాయక్, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు హాజరయ్యారు.కాగా, ఫార్యా, బ్యాంకింగ్, ఇంధనం, ఇన్‌ఫ్రా రంగాకు సంబంధించి వాణిజ్యాన్ని పెంచే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు ఇతరత్రా అంశాలను ఈ సందర్బంగా కార్పొరేట్ ఇండియా ప్రతినిధులు లేవనెత్తారు. ‘సమావేశం చాలా బాగా జరిగింది. పెట్టుబడులు, వాణిజ్య పెంపు విషయంలో సమస్యలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఇరు నేతలు హామీనిచ్చారు’ అని ఒక పారిశ్రామిక ప్రతినిధి చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 6 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.37,200 కోట్లు)గా నమోదైంది. కాగా, ఏప్రిల్ 2000 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రష్యా నుంచి భారత్‌కు 93.5 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు లభించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top