ఈ కోడి కొవ్వు తక్కువ.. రుచి ఎక్కువ

Huge Demand For Kadaknath Chicken - Sakshi

మార్కెట్‌లో తొడగొడుతున్న నల్ల కోళ్లు

కిలో మాంసం రూ.700–రూ.900.. గుడ్డు ధర రూ.20కి పైనే

ధరతో పాటు రుచి, పోషక విలువలూ ఎక్కువే

తక్కువ కొవ్వు.. ఎక్కువ ప్రొటీన్లు.. ఐరన్‌ నిల్వలు

తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ లాభాలు

ఈ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

వైఎస్సార్‌ జిల్లా ఊటుకూరులో రూ.2 కోట్లతో ‘కడక్‌నాథ్‌’ పౌల్ట్రీ ఫారం 

తల నుంచి కాలి గోటి వరకు కారుమబ్బును తలపించే నిఖార్సయిన నలుపు రంగు కోడి. మటన్‌కు పోటాపోటీగా గిరాకీ. నాటుకోడిని తలదన్నే రుచి. సాధారణ బాయిలర్‌ కోళ్లతో పోల్చితే పోషకాలలో మేటి. తెగుళ్లు దరిచేరని రోగనిరోధక శక్తి దీని సొంతం. తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్న ఈ నల్ల కోడి పేరు ‘కడక్‌నాథ్‌’. 

సాక్షి, అమరావతి: నాటుకోడి మాంసానికి ఎప్పుడూ డిమాండ్‌ ఎక్కువే. అయితే నాటుకోడిని తలదన్నేలా కడక్‌నాథ్‌ అనే ఈ ప్రత్యేక జాతి నాటు కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ధారా, జాబియా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ వంటి గిరిజన ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. రంగు, రుచితో పాటు ఈ కోళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ‘మెలనిన్‌’ అనే హార్మోన్‌ ఎక్కువగా ఉండడం వలనే ఈ కోడి నలుపు రంగును సంతరించుకుందని చెబుతారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. మార్కెట్‌లో కడక్‌నాథ్‌ కోడి మాంసం ధర కిలో అక్షరాల రూ.800లు పైమాటే. మాంసమే కాదు.. ఈ కోడి గుడ్డు కూడా కాస్ట్‌లీనే. ఒక్కొక్క గుడ్డు రూ.20 పైనే పలుకుతోంది.

ఎన్నో ‘లాభాలు’
సాధారణ బాయిలర్‌ కోళ్లతో పోలిస్తే కడక్‌నాథ్‌ కోడి మాంసంలో ప్రొటీన్స్‌/ఐరన్‌ కంటెంట్‌ చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్‌ మాత్రం చాలా తక్కువ. మాంసంలోనే కాదు ఈ కోడి గుడ్డులో కూడా అత్యధిక శాతం ప్రొటీన్లు, లినోలెయిక్‌ యాసిడ్‌లు ఉన్నాయి. ఈ కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన తెగుళ్లు పెద్దగా వీటి దరి చేరవు. ఏ వాతావరణంలోనైనా ఇవి పెరుగుతాయి. ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, సజ్జలు ఇలా ఏవైనా తిని జీర్ణించుకోగలుగుతాయి. ఇలా.. పోషకాలు అందిస్తూ వినియోగదారునికి, లాభాలు తెచ్చిపెడుతూ పౌల్ట్రీ రైతులకు కడక్‌నాథ్‌ కోళ్లు ప్రయోజనకరంగా ఉన్నాయి.


రూ.2 కోట్లతో ప్రాజెక్టు 
మంచి రుచితో పాటు అత్యధికంగా పోషకాలను అందించే ఈ కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకాన్ని మన రాష్ట్రంలో ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్‌ జిల్లా ఊటుకూరు వద్ద మూతపడిన కోళ్ల ఫారంను పునరుద్ధరించి కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకాన్ని చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పౌల్ట్రీ ఫారం నిర్వహణ కోసం కోసం ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్, వీఏఎస్, పారావెట్‌ పోస్టులను కూడా మంజూరు చేశారు. ఈ పౌల్ట్రీఫారం ద్వారా వేల సంఖ్యలో కడక్‌నాథ్‌ కోడి పిల్లలను ఉత్పత్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా వాటి పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు వ్యయమవుతుందని పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది.

నెలకు 10 నుంచి 18 గుడ్లు
సాధారణ కోళ్ల మాదిరిగానే కడక్‌నాథ్‌ కోడి రెండు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతుంది. ఐదు నెలల వయసు నుంచి నెలకు 10 నుంచి 18 చొప్పున మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది. పుంజు రెండు నుంచి రెండున్నర కేజీలు, పెట్ట ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ప్రస్తుతం లైవ్‌ కోడి ధర కిలో రూ.650లు ఉంటే, మాంసం రూ.800 పైగా పలుకుతోంది. ఇంట్లో తినేందుకు వాడే ఈ కోడి గుడ్డు ధర రూ.20కి పైగా పలుకుతుంటే.. పిల్లలు పొదిగే గుడ్డు ధర రూ.40 పైమాటే.

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం
కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకం ఎంతో లాభదాయకం. 2017లో 500 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫారం ప్రారంభించా. నేడు 1,500 కోళ్లతో నడుపుతున్నా. నిర్వహణ వ్యయం పెద్దగా ఉండదు. రైతు బజార్ల నుంచి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, మూడు పూటలా నీళ్లు పెడతానంతే. వీటికి వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగాల బెడద ఉండదు. 4–5 నెలల తర్వాత కోడి.. మాంసానికి సిద్ధమవుతుంది. మా ఫారం నుంచి ఈ కోళ్లనే కాకుండా కోడి మాంసాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నా. కోడి పిల్లలను అయితే ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నా. రూ.లక్షతో మొదలైన వ్యాపారం నేడు రూ.20 లక్షలకు చేరింది.
– ఇంటి ప్రదీప్, ప్రదీప్‌ ఫామ్స్‌ యజమాని, నున్న, కృష్ణా జిల్లా. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top