దొరకని నిధి | How Chandrababu Naidu Betrayed AP Women on Aadabidda Nidhi Scheme | Sakshi
Sakshi News home page

దొరకని నిధి

Jul 7 2026 10:40 AM | Updated on Jul 7 2026 10:59 AM

How Chandrababu Naidu Betrayed AP Women on Aadabidda Nidhi Scheme
  • చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం  
  • ఆడబిడ్డలకు రూ.1,908 కోట్ల బాకీ 
  • నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ 
  • జిల్లాలో సుమారు 5.3 లక్షల మంది అర్హులు  
  • వీరికి రెండేళ్లలో చెల్లించాల్సింది రూ.1908 కోట్లు 
     

సాక్షి, రాజమహేంద్రవరం : బూటకపు హామీలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు తీరని అన్యాయం చేసింది. ఆడబిడ్డ నిధి పేరిట 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా జిల్లాలోని అర్హులైన 5.3 లక్షల మంది మహిళలు గత రెండేళ్లలో సుమారు రూ.1,908 కోట్లు నష్టపోయారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ 4 (ప్రజా భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన) కార్యక్రమానికి అనుసంధానం చేస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేస్తున్నారే తప్ప, మహిళలకు న్యాయం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించడం లేదు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 73,927 బంగారు కుటుంబాలను గుర్తించినప్పటికీ వారి దత్తత ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు.  

పీ4 పేరుతో కాలయాపన
ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, రాజానగరం, మండపేట, అనపర్తి, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో 133 స్వర్ణ వార్డు, 455 స్వర్ణ గ్రామ సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 73,927 బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరిని దత్తత తీసుకునేందుకు జిల్లాలో 4,868 మంది మార్గదర్శులు ముందుకొచ్చారని, ఇప్పటికే 30,696 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, మిగిలిన కుటుంబాల దత్తత ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో బంగారు కుటుంబాలుగా గుర్తించిన వాటిలో ఏ ఒక్క కుటుంబాన్నీ ఎవరూ దత్తత తీసుకోలేదు.  పీ4 సర్వే పేరుతోనే చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన గడిచిపోయింది. అనంతరం వారిని దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి పెంచారు. దాతలను గుర్తించి, ఒప్పించే బాధ్యత అధికారులదే అని పాలకులు తేల్చేయడంతో వారు కొన్నాళ్లపాటు వ్యాపారులను ఒప్పించేందుకు ప్రయతి్నంచారు. దత్తత తీసుకోవాలని బలవంతం చేసినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం పీ4 ను మరిచిపోయారు.

 5.3 లక్షల మందికి అన్యాయం  
జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో 4,81,940 మంది పేద, దిగువ మధ్య తరగతి మహిళలు ఉన్నారు. వివిధ కారణాలతో డ్వాక్రా గ్రూపుల్లో చేరని పేద మహిళలు సుమారు 48 వేల మంది ఉన్నారు. మొత్తంగా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు 5.3 లక్షల మందికి పైనే ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లు (24 నెలలు) గడిచిపోయాయి. ఈ లెక్కన ఒక్కో మహిళకు నెలకు రూ.1500 చొప్పున 24 నెలలకు కలిపి రూ.36 వేలు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని అర్హులైన 5.3 లక్షల మహిళలందరికీ కలిపితే సుమారుగా రూ.1,908 కోట్లు చెల్లించాలి. ఎన్నికల వేళ అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌ ఉదరగొట్టారు. పోనీ ప్రభుత్వం గుర్తించిన 73,927 బంగారు కుటుంబాలనే ప్రాతిపదికగా తీసుకుని... ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి అయినా ఆడబిడ్డ నిధి అందించేందుకు చంద్రబాబు సర్కార్‌ ముందుకు రావడం లేదు.

మహిళలకు వెన్నుపోటు 
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి పేరిట ఆర్థిక సాయం అందించకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఓట్లు దండుకునేందుకు సూపర్‌ సిక్స్‌ పేరిట అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకున్నారు. కాపు నేస్తం, బీసీ నేస్తం పేరిట ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. – తానేటి వనిత, మాజీ హోం మంత్రి, గోపాలపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement