సోషల్‌ మీడియా పోస్టును అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా? | High Court verdict on social media posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా పోస్టును అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా?

Jun 4 2026 4:40 AM | Updated on Jun 4 2026 4:41 AM

High Court verdict on social media posts

అనుమానాల ఆధారంగా సెక్షన్‌ 153 కింద కేసు పెట్టడం చట్టవిరుద్ధం

ఈ సెక్షన్‌ కింద కేసుకు కచి్చతమైన నేరపూరిత ఉద్దేశాన్ని నిరూపించాలి 

అలాంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్‌ కింద నేరం మోపలేరు 

పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ 

సామాజిక మధ్యమాల్లో పోస్టులపై హైకోర్టు తీర్పు

ఐపీసీ సెక్షన్‌ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే.. కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే కచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్ప నిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్‌ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకు పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్‌ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. – హైకోర్టు

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియాలో ఏ పోస్టు పెట్టినా..  ఆ పోస్టు దేనికి సంబంధించిందన్న దాంతో నిమిత్తం లేకుండా దానిని అల్లర్లను ప్రేరేపించే తీవ్రమైన నేరంగా పోలీసులు చిత్రీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘ఐపీసీ సెక్షన్‌ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే, కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది.  అటువంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్‌  కింద నేరం మోపడం సాధ్యం కాదు. 

ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకూ పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్‌ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. ఒక సమూహంలో ఉన్నంత మాత్రాన లేదా ఒక నిర్దిష్ట గ్రూపుతో సంబంధం ఉన్నంత మాత్రాన, ఆ గ్రూపు చేసే ప్రతి తప్పును వ్యక్తిగతంగా ఒకరికి ఆపాదించలేం. నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేనప్పుడు, కేవలం సదరు వ్యక్తులతో పరిచయం ఉందనే నెపంతో ఎవరినీ దోషిగా నిలబెట్టలేం’, అని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఉమ్మడి కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు, మాగల్లు గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై  ఐపీసీ సెక్షన్‌ 153 కింద నమోదు చేసిన కేసును కొట్టేసింది. అయితే ఇదే కేసులో ఐపీసీ సెక్షన్‌  120బీ, 505 (2), ఐటీ చట్టం సెక్షన్‌ 66 కింద జరిగే విచారణలో (ప్రొసీడింగ్స్‌) జోక్యానికి మాత్రం నిరాకరించింది. ఈ మేరకు  ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement