అటువంటి కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు 

High Court verdict on colleges with poor management and operations - Sakshi

నిర్వహణ, కార్యకలాపాలు సరిగా లేని కళాశాలలపై హైకోర్టు తీర్పు 

ఎన్‌బీటీ అండ్‌ ఎన్‌వీసీ కాలేజీ టేకోవర్‌కు సమర్ధన 

ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ప్రభుత్వం టేకోవర్‌ చేసిందని వెల్లడి 

జీవో 17 విషయంలో జోక్యం చేసుకోలేమని స్పస్టీకరణ.. కాలేజీ సెక్రటరీ పిటిషన్‌ కొట్టివేత 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ గ్రాంట్‌తో నడిచే కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగనప్పుడు, ఆస్తుల దుర్వినియోగం జరిగినప్పుడు ఆ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చెందిన ఎన్‌బీటీ అండ్‌ ఎన్‌వీసీ కాలేజీ యాజమాన్య బాధ్యతలను, ఆస్తులను టేకోవర్‌ చేస్తూ 2017లో జారీ చేసిన జీవో 17ను హైకోర్టు సమర్ధించింది. ఆ జీవోను సవాలు చేస్తూ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ఎన్‌బీటీ అండ్‌ ఎన్‌వీసీ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్‌ నల్లా రామచంద్ర ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఆ విద్యా సంస్థ సెక్రటరీ కాలేజీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో కళాశాలలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది లేని పరిస్థితి నెలకొందని, దీంతో పేద, అణగారిన వర్గాల ప్రజలకు విద్యనందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయిందని హైకోర్టు తెలిపింది.ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వమే ఆ కాలేజీని టేకోవర్‌ చేసిందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు వెలువరించారు. 

కోడెల వల్లే మా కాలేజీకి ఈ దుస్థితి
కళాశాలను ప్రభుత్వం టేకోవర్‌ చేయడాన్ని సవా­లు చేస్తూ నల్లా రామచంద్రప్రసాద్‌ 2017లో దాఖలు చేసిన వ్యాజ్యంలో అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను ప్రతివాదిగా చేర్చి, ఆయనపై పలు ఆరో­పణలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ గంగా­రావు తుది విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డి.కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. స్థానిక రాజకీయ కారణాలతో అప్పటి స్పీకర్‌ తమ కాలేజీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నారని, యాజమాన్యంలో చీలికలు తెచ్చారని తెలిపారు.

తమ కాలేజీలోని బోధన, బోధనేతర సిబ్బందిని ఇతర కాలేజీలకు బదిలీ చేయించి, కాలేజీలో విద్యార్థులు లేకుండా చేశారన్నారు. అంతిమంగా కాలేజీని నడపలేని స్థితికి కోడెల తీసుకొచ్చారని తెలిపారు. ఆ తరువాత తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే కాలేజీని టేకోవర్‌ చేస్తూ ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందన్నారు. ఉన్నత విద్యా శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అంతర్గత వివాదాల వల్ల కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగడంలేదని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన కమిటీ ఆ కాలేజీని టేకోవర్‌ చేయాలని సిఫారసు చేసిందన్నారు. పిటిషనర్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చి, వివరణ కోరామని తెలిపారు. వివరణను పరిగణనలోకి తీసుకున్న తరువాతే కాలేజీని టేకోవర్‌ చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top