
అలైన్‌మెంట్ రీ సర్వేపై స్టే ఎత్తివేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. రైల్వే లైన్ భూ సేకరణ, రీ అలైన్‌మెంట్ సర్వే విషయంలో గతంలో విధించిన స్టేని హైకోర్టు ఎత్తేసింది. అలైన్‌మెంట్ సర్వే కొనసాగించవచ్చని రైల్వే అధికారులను ఆదేశించింది. అలైన్‌మెంట్ మార్పు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. ఫలానా మార్గంలోనే అలైన్‌మెంట్ వెళ్లాలని ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులకు స్పష్టం చేసింది.
రీ అలైన్‌మెంట్ ద్వారా ఎవరైనా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రయోజనం పొందుతున్నారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలైన్‌మెంట్ మార్చడం వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం తరఫున సీవీఆర్ రుద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి వాదనలు వినిపించారు.
విజయవాడ వరదల ప్రాణ నష్టానికిబాధ్యత ఎవరిది?
బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: గత ఏడాది సంభవించిన విజయవాడ వరదల వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోయారని, జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిదని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరూ బాధ్యులు కాదంటే కుదరదని తేల్చి చెప్పింది. తగిన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇదే తామిచ్చే చివరి అవకాశమని, తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వరదల గురించి ముందే తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు నాతాని భూపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని అందులో ఆయన పేర్కొన్నారు.