వైఎస్సార్‌సీపీ వినతిని పరిగణనలోకి తీసుకోండి | High Court issues key directives to State Election Commission | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ వినతిని పరిగణనలోకి తీసుకోండి

Oct 17 2026 5:31 AM | Updated on Oct 17 2026 5:31 AM

High Court issues key directives to State Election Commission

రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు 

నవీకరించిన ఓటర్ల జాబితాను నిర్ణీత సమయానికన్నా ముందే ప్రచురించండి

పేర్లను సరిచూసుకుని, సవరణలు కోరేందుకు ఓటర్లకు వీలుంటుంది

ఈ ప్రక్రియను రెండు రోజుల్లోనే పూర్తి చేయండి

స్పష్టమైన ఆదేశాలిచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం

సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితా విషయంలో హైకోర్టు శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడానికి, ఏవైనా లోపాలు ఉంటే సవరణలు కోరడానికి వీలుగా, నవీకరించిన స్థానిక సంస్థల ఓటర్ల జాబితాను నిర్ణీత సమయానికన్నా ముందే ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ సమగ్ర ప్రక్రియ అంతటినీ ఈ రోజు నుంచి రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. 

ఓటర్ల జాబితా విషయంలో వైఎస్సార్‌సీపీ ఈ నెల 10న ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆమోదించిన అన్ని మార్పులను చేర్చుతూ, 2026 జూలై 15 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకునేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన, ఏకరూప సూచనలను జారీ చేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వడ్డిబోయన సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నికల సంఘం చర్యలను అడ్డుకోండి 
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)  ఆధారంగా డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణల కోసం 31.08.2026 వరకు వచ్చిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత స్థానిక సంస్థల తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని కోరుతూ తామిచ్చిన వినతి పత్రాన్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 30న జారీ చేసిన నోట్‌ ప్రకారం సర్‌ ప్రక్రియలో 31.8.2026 నాటికి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 16.10.2026న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం 05.02.2026 వరకు నవీకరించిన డేటా ఆధారంగా స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. ఈ చర్యలను అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. 

ఆ ఓటర్ల జాబితాల కాపీలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం
రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలోని అన్ని 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 06.02.2026 నుంచి 14.10.2026 వరకు జరిగిన చేర్పులు, తొలగింపులు సవరణలతో కూడిన అనుబంధాల హార్డ్‌ కాపీలను, ఫోటోలతో సహా అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరామని పేర్కొన్నారు. ఆ అధికారి నుంచి సదరు సమాచారం అందిన వెంటనే వైఎస్సార్‌సీపీ వినతి పత్రంపై తదుపరి చర్యలు చేపడుతామని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, జూలై 15 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement