ఎన్నికలను సజావుగా నిర్వహించాలని చంద్రబాబుకు లేదు
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఎంపీ మిథున్‌రెడ్డికి ఫోన్.. దాడి ఘటనపై ఆరా
చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపాటు
పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయి
అన్యాయాలను సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టీకరణ
దాడులు, దౌర్జన్యాలపై చట్టపరంగా పోరాటం చేస్తామని ప్రకటన
సాక్షి, అమరావతి: రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నాయకుడు పీవీ మిథున్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్ చేసి పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదని, రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌లా మార్చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నాయకుడికే భద్రత లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, దాడులు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందని పేర్కొన్నారు.
చట్టపరంగా పోరాటం చేస్తాం
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను సమర్థంగా ఎదుర్కొంటామని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని, ధైర్యం, సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలంటే పారామిలటరీ బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని న్యాయస్థానాల ముందు ఉంచుతామని తెలిపారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వైఎస్సార్సీపీదని, హింసతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చరిత్ర చంద్రబాబుదని వైఎస్ జగన్ విమర్శించారు.


