ప్రపంచంలో 64.5 కోట్లమందికి ఆకలి బాధ | United Nations FAO 2025 report revealed | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో 64.5 కోట్లమందికి ఆకలి బాధ

Oct 17 2026 5:28 AM | Updated on Oct 17 2026 5:28 AM

United Nations FAO 2025 report revealed

వృథా అయిన ఆహారం వందకోట్ల టన్నులు 

ప్రపంచ ఆర్థికవ్యవస్థకు రూ.90 లక్షల కోట్ల నష్టం

ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏవో 2025 నివేదిక వెల్లడి   

సాక్షి, అమరావతి: ఒకవైపు ఆకలి కేకలు.. మరోవైపు చెత్తలోకి గుట్టలుగుట్టలుగా పారబోస్తున్న ఆహారం.. ఇదీ ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ విభాగం (ఎఫ్‌ఏవో) 2025 సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో విడుదల చేసిన తాజా నివేదిక ఈ అంశాన్ని మరోసారి ప్రముఖంగా ప్రస్తావించింది. ఆహా­రాన్ని వృథాచేయడం వల్ల పేదప్రజలు ఆకలితో అలమటిస్తుండటంతోపాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థకు తీవ్రనష్టం కలిగిస్తోందని ఆ నివేదిక పే­ర్కొంది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. 

ఆకలి  కేకలు 
» ప్రపంచవ్యాప్తంగా 2025లో 64.5 కోట్లమంది ఆకలితో బాధపడ్డారు. ప్రతి 13 మందిలో ఒకరికి ఆహారం దొరకలేదు. 
» కోవిడ్‌ వ్యాప్తితో ఆకలి బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2019లో ప్రపంచంలో ఆకలి బాధితులు 61 కోట్లమంది ఉండేవారు. 
» గత మూడేళ్లుగా ప్రపంచంలో ఆకలి బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 2022లో 8.6 శాతం ఉన్న ఆకలి బాధితుల సంఖ్య 2024లో 8.1 శాతానికి, 2025లో 7.8 శాతానికి తగ్గింది. కానీ కోవిడ్‌ వ్యాప్తికి ముందున్న స్థితికి ఇంకా చేరుకోలేదు. 
» ఆఫ్రికా ఖండంలో ఆకలి బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఆ ఖండంలో 30.9 కోట్లమంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రతి అయిదుగురిలో ఒకరు ఆకలి బాధితులే. ఆసియా ఖండంలో 29.2 కోట్లమంది, లాటిన్‌ అమెరికా దేశాలు, కరేబియన్‌ దీవుల్లో 3.2 కోట్లమంది కనీస ఆహారానికి నోచుకోవడం లేదు. 
» 8 దేశాల్లో ఆకలి బాధ అత్యంత ఆందోళనకరంగా ఉంది. వాటిలో 7 దేశాలు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. మొదటి స్థానంలో సోమాలియా ఉంది.

ఆహారం వృథా
» ప్రపంచవ్యాప్తంగా ఆహారం భారీగా వృథా అవుతోంది. 2025లో వందకోట్ల టన్నుల ఆహారం వృథా అయింది. 
» ఆహార ఉత్పత్తుల్లో 13 శాతం దుకాణాలకు చేరడానికి ముందే.. స్టోరేజ్, రవాణా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర ప్రక్రియల్లో వృథా అవుతోంది. దీనివిలువ రూ.37.94 లక్షల కోట్లు కావడం విభ్రాంతి కలిగిస్తోంది. 
» ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కుటుంబాలు ఐదో వంతు ఆహారాన్ని చెత్తబుట్టలో పారబోస్తున్నాయి. దీన్లో కుటుంబాల వాటా 60 శాతం కాగా రెస్టారెంట్లు, దుకాణాలు 28 శాతం, ఇతరత్రా 12 శాతం.
» ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏటా సగటున 132 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. అందులో 79 కిలోల వృథా 
ఇంటివద్దే. 
» ఆహార వృథాలో మాల్దీవులు మొదటి స్థానంలో, స్పెయిన్‌ చివరి స్థానంలో ఉన్నాయి. మాల్దీవుల్లో ప్రతి వ్యక్తి ఏటా సగటున 260 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. స్పెయిన్‌లో ప్రతి వ్యక్తి ఏటా సగటున 39 కిలోలను వృథా చేస్తున్నారు. 
» వృథా చేస్తున్న ఆహారంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఏటా రూ.90 లక్షల కోట్లు నష్టపోతోంది.  
» ప్రపంచంలో 28 శాతం సాగుభూమిలో పండిస్తున్న పంట వృథా అవుతోంది. 
» ఆహార వృథా ప్రపంచంలో దాదాపు 8 శాతం కాలుష్యానికి కారణమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement