
శ్రీశైలం డ్యామ్ నుంచి పరుగులిడుతున్న కృష్ణమ్మ
రేపటికి వాయుగుండంగా మారే అవకాశం
శుక్రవారం తీరం దాటొచ్చని అంచనా
మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో మంగళవారం రాత్రి అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య బంగాళాఖాతంలో గురువారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నేడు ఉత్తరాంధ్ర, ఉమ్మడి కృష్ణాలో వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా పెడనలో 3.9, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.4, నర్సీపట్నం, కాకినాడలో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా.. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం
వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. 3 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో ఉంచినట్టు పేర్కొన్నారు.
శాంతించని నదులు
కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిపై రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 6,22,504 క్యూసెక్కుల కృష్ణా జలాలను నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇంత అధికంగా నీరు విడుదలవుతోంది.
కాగా.. నాగార్జున సాగర్ నుంచి 6,17,678 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు 6,41,247 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రం 6 గంటలకు 6,69,188 క్యూసెక్కులకు చేరింది. ఇందులో 6,53,828 క్యూసెక్కుల వదర సముద్రంలోకి వదిలేశారు. మిగిలిన 15,360 క్యూసెక్కుల వరద నీటిని పంట కాల్వలకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 16.1 అడుగులకు చేరింది. వరద ప్రభావంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
మళ్లీ పెరుగుతున్న గోదావరి
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సమీపాన కాటన్ బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 12.60 అడుగులకు చేరింది. 10,96,937 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా.. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద గోదావరి నీటిమట్టం 33 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 10.73 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద 50.30 అడుగులకు నీటిమట్టం చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.