
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన కుమారుడు
అనారోగ్యంతో మృతి చెందిన తల్లి
చివరి చూపునకు రాలేక తల్లడిల్లిన కొడుకు
నంద్యాల: ‘అమ్మా నిన్ను చూసేందుకు రాలేకపోతున్నా.. నీ కడ చూపునకు నోచుకోలేనంతా దూరంలో ఉన్నాను. నీ పాడి మోయలేక పోతున్నా.. నన్ను క్షమించు’ అంటూ ఓ తనయుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. ఉపాధి కోసం దుబాయ్‌లో ఉన్న కుమారుడు తల్లి అంత్యక్రియలకు రాలేక ఎంతో కుమిలిపోయాడు. వీడియో కాల్‌లో తన తల్లి చివరి చూపును వీక్షించి కన్నీటిపర్యంతమయ్యాడు. క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పగిడి జయమ్మ(48) గత కొంతకాలంగా ఆనారోగ్యంతో ఇబ్బందులు పడేది.
ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె మంగళవారం మృతి చెందింది. గత ఏడేళ్ల క్రితం భర్త కూడా మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లు సారిక, ఓళమ్మ, ఒక్కగానొక్క కొడుకు ఓబులేసు ఉన్నారు. కొడుకు దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిమరణ వార్త తెలుసుకున్న తనయుడు ఆందోళనకు గురయ్యాడు. దీంతో బంధువులు వీడియో కాల్ చేసి అతని తల్లి అంత్యక్రియలను చూయించారు. తాను బతికుండి కన్న తల్లి పాడి మోయలేక పోతున్నానని.. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటన గ్రామంలో పలువురిని కంటతడి పెట్టించింది.