తూర్పు గోదావరి జిల్లా: ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది.. సరదాగా సాగిపోతున్న ప్రయాణంలో విషాదం అలముకుంది.. కడియం మండలం వేమగిరి శివారులో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య, కుమార్తెలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం మండలం కేదారిశెట్టిపల్లి గ్రామానికి చెందిన చిట్టూరి వెంకటేష్ (36) రాజమహేంద్రవరంలోని టాటా మోటార్స్‌లో పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలసి కడియం మండలం వేమగిరిలో నివాసం ఉంటున్నాడు.
అయితే సోమవారం సెలవురోజు కావడంతో భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలను తీసుకుని రావులపాలెంలోని బంధువుల ఇంటికి మోటారు సైకిల్‌పై బయలు దేరారు. వేమగిరి సమీపానికి వచ్చేసరికి అక్కడి ఒక నర్సరీ వద్ద నుంచి హైవేపైకి ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా ఒక కారు వేగంగా వచ్చి, వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొంది. దీంతో వెంకటేష్, భార్యా పిల్లలతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ తల బలమైన గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కల్పన, తొమ్మిదేళ్ల పెద్ద కుమార్తె లోహతాశ్రీ, ఏడాదిన్నర వయసుగల చిన్న కుమార్తె సౌర్యశ్రీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బంధువులు ఇంటికి వెళ్లేందుకు ఆనందంగా బయలు దేరిన వారు కొద్దిసేపటికే ప్రమాదం బారిన పడి, వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషయం నెలకొంది. భార్య, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా కడియం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ లక్ష్మీప్రసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


