ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
మృతుడి తండ్రి ఫిర్యాదుతో బయటపడ్డ బాగోతం
నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు
గుంటూరు జిల్లా: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత భర్తను హతమార్చిన ఘటన ఇది. వివరాల్లోకెళ్తే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన లోకం శివనాగరాజు(45), లక్ష్మీ మాధురి దంపతులు. ఉపాధి నిమిత్తం వీరు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ సినిమా హాల్‌లో పనిచేస్తున్న మాధురికి తరచూ సినిమాలకు వచ్చే గోపీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపీ హైదరాబాద్‌లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తుండడంతో, శివనాగరాజుకు డ్రైవింగ్ రావడంతో, అతన్ని డ్రైవర్‌గా పంపించి గోపీ మాధురితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు.
విషయం బయట పడడంతో శివనాగరాజు తన భార్యను తీసుకుని చిలువూరులో నివాసముంటున్న తన తండ్రి, మాజీ ఎంపీటీసీ లోకం గాంధీ వద్దకు వచ్చారు. అయితే, మాధురి ఇక్కడికి వచ్చాక కూడా గోపీతో వివాహేతర సంబంధం కొనసాగించింది. మరోసారి వీరిద్దరి వ్యవహారంపై శివ నాగరాజు ప్రశి్నంచడంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య హత్యకు పథకం రచించింది. ప్రియుడితో నిద్ర మాత్రలు తెప్పించి ఈనెల 18న రాత్రి శివనాగరాజుకు భోజనంలో కలిపి ఇచ్చింది. దీంతో శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
అనంతరం ప్రియుడు గోపీని పిలిపించి ఇద్దరూ కలిసి శివనాగరాజు ముఖంపై దిండు పెట్టి నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో హత్యగా నిర్ధారించి లక్ష్మీ మాధురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య ఉదంతం మొత్తం వెల్లడించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసును హత్య కేసుగా మార్చి, నిందితుడు గోపీ కోసం గాలింపు చేపట్టారు.


