
2024 జూలైలో జీఎస్టీ ఆదాయం తిరోగమనం
దానితో పోల్చుకుని 2025, జూలైలో జీఎస్టీ ఆదాయం 14 శాతం పెరిందని ప్రచారం చేసుకోవడం బాధ్యతారాహిత్యం
2023 జూలైతో పోల్చితే ఈ జూలైలో జీఎస్టీ ఆదాయం పెరిగింది కేవలం 6.3 శాతమే
రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టీకరణ
తప్పుడు ప్రచారం మానుకుని వాస్తవ ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూలైలో జీఎస్టీ ఆదాయం పెరిగిందని, ఇది ప్రభుత్వ విజయమని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. జీఎస్టీ ఆదాయం పెరిగిందన్నది వట్టిమాటేనని స్పష్టం చేశారు. 2024 జూలైలో జీఎస్టీ ఆదాయం ప్రతికూలంగా ఉందని, దానితో పోల్చుకుని 2025 జూలైలో జీఎస్టీ ఆదాయం 14 శాతం పెరిగిందని.. ఇది తమ ప్రభుత్వ విజయమని కూటమి సర్కారు ప్రచారం చేసుకోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని చెప్పారు.
2023 జూలైతో పోల్చితే 2025 జూలైలో అంటే.. రెండేళ్లలో జీఎస్టీ ఆదాయం పెరిగింది కేవలం 6.3 శాతం మాత్రమేనని ఎత్తిచూపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2025 జూలైలో జీఎస్టీ ఆదాయం 14 శాతం పెరిగిందంటూ ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం ప్రచారం చేస్తోందని బుగ్గన మండిపడ్డారు.
ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల 2024 జూలైలో జీఎస్టీ ఆదాయం తగ్గిందని, దానితో పోల్చుకుని ఇప్పుడు జీఎస్టీ ఆదాయం పెరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 2023 జూలైలో జీఎస్టీ నికర వసూళ్లు రూ. 2,755 కోట్లుగా ఉంటే.. 2025, జూలైలో జీఎస్టీ రాబడి రూ.2,930 కోట్లేనని ఎత్తిచూపారు. అంటే.. 2025లో ప్రస్తుత వార్షిక వృద్ధి కేవలం 3.13 శాతం మాత్రమేనని, స్థూల జీఎస్టీ ఆదాయ వృద్ధి కేవలం 2.88 శాతమేనని.. దీన్ని బట్టి చూస్తే జీఎస్టీ ఆదాయం వచ్చింది తక్కువేనన్నారు.
లోకేశ్ మాటలు హాస్యాస్పదం
జీఎస్టీ ఆదాయం స్వల్పంగా పెరిగితే.. దాన్ని ప్రభుత్వం సాధించిన పెద్ద ఆరి్థక విజయంగా మంత్రి నారా లోకేశ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగవంతమైన జీఎస్టీ వృద్ధి రేటును నమోదు చేసిందని బుగ్గన గుర్తు చేశారు. కానీ.. 2024 జూలైలో కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల జీఎస్టీ ఆదాయం ప్రతికూలంగా ఉందని.. కానీ దాన్ని మంత్రి లోకేశ్ సౌకర్యవంతంగా మర్చిపోతున్నారంటూ విమర్శించారు.
ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తూ లబ్ధి పొందడానికి యత్నించడం దురదృష్టకరమన్నారు. చేసిన తప్పులు ఒప్పుకుని.. వాటిని సరిదిద్దుకోవడానికి బదులుగా మళ్లీ అదే తప్పులు చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. జీఎస్టీ ఆదాయంపై తప్పుడు ప్రచారం మానుకుని.. పెట్టుబడుల సాధన, ఉద్యోగాల కల్పన ద్వారా వాస్తవమైన ఆర్థిక వృద్ధి సాధించేలా వ్యూహాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి బుగ్గన హితవు పలికారు.