
పెరుగుతున్న మానసిక సమస్యలు
అర్ధంతరంగా ముగుస్తున్న జీవితాలు
రోజుకు ఒకరు చొప్పున బలవన్మరణం
సత్యసాయి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు
‘బలమే జీవితం.. బలహీనతే మరణం’ అని ఆలోచనాత్మక వాక్యం చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్న సమస్యలకే కుంగిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ సమస్యలనో.. ఆర్థిక ఇబ్బందులనో.. అనారోగ్య సమస్యలనో.. పరీక్ష తప్పామనో.. చదువు ఇష్టం లేదనో.. ప్రేమ విఫలమైందనో.. ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పెరగిపోతున్నాయి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందన్న విషయాన్ని మరచి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
కదిరి: ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంలో చేజేతులా సమాప్తం చేసుకుంటే వారి మీద ఆధారపడ్డవారిని, వారి మీదే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నవారిని రోడ్డున పడేసినట్లే అవుతుంది.
సత్యసాయి జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకూ కేవలం 9 రోజుల్లోనే 9 మంది పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. వీరిలో అధిక శాతం మంది యువతీ యువకులే. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగానే ఇలా బలవన్మరణాలు జరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.
భయపెడుతున్న ఘటనలు..
మడకశిర పట్టణానికి చెందిన మధు(23) అగళి మండలంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇదే విషయంగా చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒక ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదనే భావంతో క్షణికావేశంలో ఈ నెల 1వ తేదీ ఆత్మహత్య చేసుకున్నాడు.
» నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(40) చిన్నపాటి అంశానికి భార్యతో గొడవ పడి కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నాడు. చివరకు ఒంటరి జీవితంపై విరక్తి పుట్టి ఈ నెల 5న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.= ధర్మవరంలోని కోట కాలనీకి చెందిన తొండమాల మహేష్(37) ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. పెళ్లి సంబందాలేవీ కుదరడం లేదని మనస్థాపానికి గురై ఈ నెల 6న ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
» మడకశిర మండలం హెచ్‌ఆర్ పాళ్యంకు చెందిన ప్రవీణ్‌కుమార్(27) సైతం పెళ్లి సంబందాలు కుదరడం లేదని ఈ నెల 6న రాత్రి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
» చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన పార్వతి, గంగాధర్‌ల కుమార్తె అశ్వని(16) రామగిరి కేజీబీవిలో ఇంటర్ చదువుతుండేది. దసరా సెలవుల్లో ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఈ నెల 8న ఇంటి పక్కనే ఉన్న షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
... ఇలా ఒకరిద్దరు కాదు... ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 153 మంది బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన చెందే విషయం. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు లేవు. సగటున ప్రతి రెండు రోజులకు ఒకరు ఆత్యహత్య చేసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ అధికారికంగా వెలుగు చూసిన ఘటనలే. ఇక అనధికారిక లెక్కలు మరిన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది.
కౌన్సెలింగ్ అవసరం
మానసిక సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. ప్రారంభ దశలోనే గుర్తించి తగిన కౌన్సెలింగ్ ఇప్పిస్తే వ్యతిరేక ఆలోచనల నుంచి బయట పడవచ్చు. మానసిక సమస్యలతో బాధపడే వారిని మరింత కోపానికి, ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. వీలైనంత వరకూ వారు అందరిలో ఉంటూ ఆనందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ ఫైరోజాబేగం, డీఎంహెచ్‌ఓ
ఒక్క క్షణం ఆలోచించాలి
జీవితం ఎంతో విలువైనది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. నమ్ముకున్న అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఆ క్షణంలో తలుచుకుంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాదు. సమస్యలకు చావు పరిష్కారం కానే కాదు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తాం. యువతను మేల్కోలిపే కార్యక్రమాలు చేపడతాం. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ
ఇవీ హెచ్చరిక సంకేతాలు..
» ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం
» స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండటం
» విపరీతమైన కోపం, భయం ప్రదర్శిస్తూ సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం.
» నిరంతరం నిస్సహాయతాభావాన్ని వ్యక్త పరుస్తుండడం.
» అతిగా మద్యం సేవించడం, ప్రతీకార కాంక్షతో మాట్లాడుతుండడం.
» ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్ర, ఆకలిలో మార్పులు ఉండడం.
» పండగలు, వివాహాల వంటి వేడుకల్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం.
» స్నేహితులకు విషాదరకమైన మెజేస్‌లు పంపడం.
» చనిపోతున్నట్లు ముందుగానే వారి మాటల్లో పరోక్షంగా వ్యక్తపరుస్తుండడం.