ఇల్లే నయా జిమ్‌

Growing awareness among people about physical and mental health - Sakshi

పెరుగుతున్న ‘హోమ్‌ జిమ్‌’ ట్రెండ్‌

బయటకు వెళ్లే తీరికలేక ఇంట్లోనే వ్యాయామం

గణనీయంగా పెరుగుతున్న  వ్యాయామ పరికరాల కొనుగోళ్లు

స్మార్ట్‌ గాడ్జెట్లు, ఫిట్‌నెస్‌ యాప్‌ల వినియోగంపై ఆసక్తి

సాక్షి, అమరావతి: శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి ‘ఫిట్‌నెస్‌’ మంత్రం జపిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల ముప్పును తప్పించుకునేందుకు అత్యధికులు వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పట్టణాలు, నగరాలతోపాటు సెమీ అర్బన్, సబ్‌ అర్బన్‌ ప్రాంతాల్లోనూ ‘హోమ్‌ జిమ్‌’ ట్రెండ్‌ పెరుగుతోంది. 

గుండె ఆరోగ్యంపై దృష్టి
గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడటం వలన కార్డియోవాస్కులర్‌ వ్యాయామ పరికరాలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవే మార్కెట్‌ వాటాలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో ట్రెడ్‌మిల్స్, స్టేషనరీ బైక్‌లు, రోయింగ్‌ యంత్రాలు, ఎలిప్టికల్స్‌ ఉన్నాయి.

భారత్‌ టాప్‌..
తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో గత ఏడాది గృహ ఫిట్‌నెస్‌ పరికరాల పరిశ్రమ మార్కెట్‌ విలువ 13,741.23 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఆసియన్‌–పసిఫిక్‌ దేశాల్లోనే అత్యధిక మార్కెట్‌ విలువగా నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రజలు అత్యధికంగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం.

దేశంలో భౌగోళికంగా చూస్తే పశ్చిమ, మధ్య భారతం అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇక్కడ పట్టణీకరణ, పెరుగుతున్న తలసరి ఆదాయం దీనికి కారణంగా తెలుస్తోంది. తూర్పు, దక్షిణ భారత దేశంలోనూ ఫిట్‌నెస్‌ మార్కెట్‌ క్రమంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు.

ఆన్‌లైన్‌ ఆర్డర్ల వృద్ధి
దేశంలో ఇటీవల గృహ వ్యాయామ పరిక­రాల కొనుగోలులో 45 శాతం ఆన్‌లైన్‌ ఆ­ర్డర్లు పెరిగాయి. ముఖ్యంగా ట్రెడ్‌మిల్స్, ఎక్సర్‌సైజ్‌ బైక్‌లు, డంబెల్‌ సెట్‌లు, బెంచ్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. సుమారు రూ.1,300–రూ.2,000 ధరలో వివిధ రకాల బరువులు, రాడ్‌లు, వెయిట్‌ బార్‌­లు, జిమ్‌ ఉపకరణాలు లభిస్తున్నాయి. మరో­వైపు యోగా మ్యాట్‌లు, రెసిస్టెన్స్‌ బ్యాండ్‌లు, ఫోమ్‌ రోలర్‌లు, టమ్మీ ట్రిమ్మ­ర్లు వంటి సులభమైన వ్యాయామ పరిక­రాల విక్ర­యం విరివిగా ఉంటోంది.

ఆన్‌­లైన్‌ మార్కెట్‌ వ్యాపారం గత సంవత్సరం దాదాపు ఏడు రెట్లు పెరిగింది. చాలా కంపెనీలు వినియో­గదారులను ఆకర్షించేందుకు ఒకే పరికరంపై 3కు పైగా వివిధ రకాల వ్యాయామాలు చేసుకునేలా డిజైన్లు చేస్తున్నాయి.

‘స్మార్ట్‌’గా వాడుతున్నారు
ఫిట్‌నెస్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌లు భారత్‌తో­పా­టు ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరి­గాయి. 2023లో స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ల వంటి వేరియబుల్‌ టెక్నాలజీలు సరికొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. దీంతోపాటు ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ సెషన్‌/వర్చువల్‌ ఫిట్‌నెస్‌ సెషన్లు పెరగనున్నాయి. ఇంతకు ముందు ఆన్‌లైన్‌ శిక్షణ గురించి పెద్దగా అవ­గాహన లేనివారు కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌ శిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండటం విశేషం.

ఆసక్తి పెరిగింది
కోవిడ్‌ తర్వాత హోమ్‌ జిమ్‌లు పెరిగాయి. తక్కువ ధరల్లో వ్యాయామ పరికరాలు వస్తుండటం, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో చాలామంది స్వయంగా వ్యా­యామాలు చేయడం నేర్చుకుంటున్నారు. కొంతమంది మా లాంటి ట్రైనర్స్‌ను పెట్టు­కుంటున్నారు. హోమ్‌ జిమ్‌ ఇంటిల్లిపాదికి ఎంతగానో ఉపయోగపడుతోంది. 
– సందీప్, ఫిట్‌నెస్‌ ట్రైనర్, విజయవాడ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top