YSR Jagananna Colonies: కలల సౌధానికి ‘మెగా’ శంకుస్థాపన

Grand Success For Second Day In YSR Jagananna Colonies - Sakshi

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రెండో రోజూ గ్రాండ్‌ సక్సెస్‌

1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన అధికారులు

ఏకంగా 2,90,907 ఇళ్లకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించిన లబ్ధిదారులు

ఇంత భారీ ఎత్తున చేయడం దేశంలో ఇదే ప్రథమం

సాక్షి, అమరావతి: సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి లబ్ధిదారులు పోటీపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా తమ కలల సౌధం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో శనివారం ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. తొలి రోజు గురువారం 2,11,413 ఇళ్లకు శంకుస్థాపన చేసి సృష్టించిన రికార్డును రెండో రోజు అధిగమించారు. రెండో రోజు శనివారం 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశిస్తే.. దాన్ని అధిగమించి ఏకంగా 2,90,907 గృహాలకు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 227 శాతం అధికంగా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు.


విజయనగరం సమీపంలోని గుంకలాం లే అవుట్‌లో భూమి పూజ చేస్తున్న లబ్ధిదారులు 

దేశ చరిత్రలో ఒకే రోజున స్వయంగా లబ్ధిదారులే 2,90,907 ఇళ్లకు భూమిపూజ చేసి.. శంకుస్థాపన చేయడం ఇదే ప్రథమమని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తొలి దశలో 8,905 వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని గత నెల 3న వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ ఇళ్లను జూన్‌ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తోంది. రెండు రోజుల్లో మొత్తం 2.56 లక్షల గృహాలను లక్ష్యంగా నిర్దేశిస్తే 5,02,320 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగనుంది.


గుంటూరు జిల్లా తెనాలి మండలం శిరిపురంలో ఇళ్ల శంకుస్థాపన పనుల్లో లబ్ధిదారులు 

కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో సమీక్ష..
మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణ్‌ భరత్‌ గుప్తాలు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ‘తమకు ఇంటి స్థలంతోపాటూ ఇంటిని మంజూరు చేసి.. తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి అందించిన సీఎం వైఎస్‌ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం’ అని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనపల్లికి చెందిన దువ్వూరు భవాని చెప్పారు. 

ఇదే స్ఫూర్తితో వేగంగా ఇళ్ల నిర్మాణం
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదన్నది సీఎం జగన్‌ సంకల్పం. అందరికీ ఇళ్లు అందించే దిశగా భారీ ఎత్తున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ఆ స్థలాల్లో తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రెండు రోజుల్లో 2.56 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే.. లబ్ధిదారులు పోటీ పడి 5.02 లక్షల ఇళ్లకు భూమి పూజ చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో వేగంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం.
– అజయ్‌ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top