ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళుతున్న విద్యార్థులు
ఎన్‌బీటీ అండ్ ఎన్‌సీవీ కళాశాల ఆస్తులు తిరిగి ప్రైవేటు యాజమాన్యానికే
101 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం
అదే పేరుతో కొనసాగించాలని కోరుతున్న విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల, కళాశాల ఆస్తులను తిరిగి ప్రైవేటు యాజమాన్యానికి అప్పగిస్తూ జీఓ జారీ చేయటం విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేసింది. దీంతో తమకు న్యాయంచేయాలని కోరుతూ విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కళాశాలను అదేపేరుతో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు
అసలేం జరిగిందంటే..: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తూ 2023లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కళాశాలను గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్వా«దీనం చేసుకున్న ఎన్‌బీటీ అండ్ ఎన్‌సీవీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. గతంలో ఇదే ప్రాంగణంలో జేఎన్‌టీయూ–ఎన్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహించారు. వారికి సొంత భవనాలు సమకూరటంతో సదరు ప్రాంగణాన్ని డిగ్రీ కళాశాలకు కేటాయించారు. అయితే తిరిగి చంద్రబాబు ప్రభుత్వం రావటంతో ప్రభుత్వ ఆ«దీనంలో ఉన్న కళాశాల, కళాశాల ఆస్తులను తిరిగి కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీ త్రికోటేశ్వరస్వామి ఎడ్యుకేషనల్ సోసైటీ(పాత యాజమాన్యం)కి అప్పగిస్తూ జీఓ జారీ చేసింది.
దీంతో సొసైటీ ప్రతినిధులు తమ కళాశాలను, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారింది. కళాశాల పేరు ఎన్‌బీటీ అండ్ ఎన్‌సీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా నమోదు కావటంతో ఇప్పుడు తమను వేర్వేరు కళాశాలల్లో చేరమనటంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో 101 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సంబంధించిన రికార్డులన్నీ ఇదే కళాశాల పేరుతో ఉండటంతో హఠాత్తుగా వేరే కళాశాలకు బదిలీ చేస్తే తాము నష్టపోతామని విద్యార్థులు చెబుతున్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తింపుతో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతోనే స్కాలర్‌షిప్‌లు ఇతర సదుపాయాలు పొందుతున్నారు. సచివాలయం బయోమెట్రిక్ ట్యాగ్ సైతం ఎస్‌బీటీ అండ్ ఎన్‌సీవీ ప్రభుత్వ కళాశాల పేరుతోనే ఉన్నాయి. కళాశాలను పాత యాజమాన్యానికి అప్పగించి తమను వేరే కళాశాలకు మార్చినట్లయితే తాము నష్టపోతామని వాపోతున్నారు. తృతీయ సంవత్సరం పూర్తి చేసే వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అదే పేరుతో కొనసాగించాలని కోరుతున్నారు.


