
రాష్ట్రంలో ఆహార భద్రతను గాలికి వదిలేసిన ప్రభుత్వం
కల్తీలు పెరుగుతుంటే... తగ్గుతున్న తనిఖీలు
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ‘ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం ఔషధం వంటిది. తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.’ అంటూ ప్రజలకు సూచనలు ఇచ్చిన సీఎం చంద్రబాబు.. చేతల్లో మాత్రం ఆహార భద్రతా విభాగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఆహార తయారీ సంస్థల్లో ఆహార భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడింది. ఉప్పు, కారం, పసుపు, పాలు.. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాల కల్తీ రోజు రోజుకు పెచ్చుమీరుతుంటే నియంత్రణ చర్యలు మాత్రం తిరోగమనంలో ఉంటున్నాయి.
సురక్షిత, పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రోత్సహించడానికి దేశంలోని రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై ఇటీవల ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23, 2023–24తో పోలిస్తే బాబు ఏలుబడిలో 2024–25లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన తనిఖీలు తగ్గినట్టు వెల్లడైంది. నివేదికలోని మరికొన్ని అంశాలు..
» రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాల్సిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం).. అధికారులు, సిబ్బంది లేక కనుమరుగు అయ్యే దుస్థితిలో ఉంది. ఈ విభాగానికి 723 శాంక్షన్ పోస్టులు ఉండగా, ఏకంగా 80 శాతం (580 పోస్టులు) ఖాళీగా ఉన్నాయి. కేవలం 143 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
»ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఐపీఎం ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తర్వాత రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ అధికారి ఒక్కరూ లేని దయనీయ పరిస్థితి నెలకొంది.
» గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైజాగ్, గుంటూరు, తిరుపతిల్లో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లను కేంద్రం మంజూరు చేసింది. అదే విధంగా తిరుమల, కర్నూలు ల్యాబ్‌లకు అప్పట్లోనే ప్రతిపాదనలు పంపారు. వీటిని రూ.100 కోట్లతో పూర్తిగా కేంద్రమే ఏర్పాటు చేస్తోంది. పరికరాల కొనుగోలుకు టెండర్‌లు పిలిచి, వర్క్ ఆర్డర్‌లు కూడా ఇచ్చారు.
వీటిల్లో పనిచేయడానికి ఒక్కో ల్యాబ్‌లో సగటున 50 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. నెల రోజుల్లో తిరుమల, వైజాగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరో ఆరు నెలల్లో మిగిలిన ల్యాబ్‌లు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించనే లేదు.
» రాష్ట్ర కార్యాలయంలో జాయింట్ ఫుడ్ కంట్రోలర్, డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ పోస్టులు ఖాళీగా>నే ఉన్నాయి. పదోన్నతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. పదోన్నతికి అర్హులైన అధికారులున్నప్పటికీ జిల్లాలు వదిలేసి రావాల్సి వస్తుందని వారు పదోన్నతులు చేపట్టకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలున్నాయి.
» అరకొర తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించడానికి ల్యాబ్‌లలో కనీస వసతులు కూడా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
» గత ప్రభుత్వంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నాలుగు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాహనాలు కొన్నారు. వీటిని ప్రభుత్వం మూలనపడేసింది.