పల్లెలకూ ఐటీ ఫలాలు

Goutham Reddy says that AP Govt is giving highest priority to IT sector - Sakshi

గ్రామానికి ఐదు చొప్పున మొత్తం 90,000 పైగా వర్క్‌ స్టేషన్ల ఏర్పాటు 

ఐటీ సీఎక్స్‌వో సదస్సులో మంత్రి మేకపాటి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని.. ఇందులో భాగంగా ఐటీ ఫలాలను గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామానికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామ సచివాలయాల్లో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ గ్రామ సచివాలయంలో కనీసం 5–6 వర్క్‌ స్టేషన్లు (కంప్యూటర్లు) చొప్పున 2024 నాటికి 90,000 పైగా వర్క్‌ స్టేషన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. కోవిడ్‌–19 తర్వాత ఐటీ రంగంలో వచ్చిన మార్పులు, రాష్ట్రంలో పెట్టుబడుల అవసరాలు వివరించడంలో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ సీఎక్స్‌వో పేరుతో శుక్రవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, స్మార్ట్‌ సిటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వంటి ఆరు కీలక రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంపుపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. టెక్నాలజీ ద్వారానే కరోనాను  ఎదుర్కొన్నట్లు తెలిపారు.  

విశాఖలో అంతర్జాతీయ సదస్సు 
సదస్సును 25 కంపెనీల సీఈవోలతో నిర్వహిద్దామని ఆహ్వానాలు పంపగా 75 కంపెనీలు సానుకూలత వ్యక్తం చేశాయని.. ఇందులో, కోవిడ్‌ సమయంలోనూ 53 కంపెనీల సీఈవోలు, ఎండీలు ప్రత్యక్షంగా హాజరుకావడంతో పాటు, 10కి పైగా కంపెనీ ప్రతినిధులు వర్చువల్‌గా హాజరైనట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మేలో విశాఖలో నీతిఆయోగ్, నాస్కామ్‌లతో కలిసి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. 5జీ టెక్నాలజీ, రోబోటిక్స్, జెనిటిక్స్, ఏఐ వంటి హైఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. దేశీయ ఐటీ రంగంలో ఐదు శాతం ఉన్న రాష్ట్ర వాటాను మూడేళ్ల లో 10శాతానికి పెంచాలన్నదే లక్ష్యమన్నారు. 

ఆరు అంశాలపై సమావేశాలు 
స్కిల్లింగ్, ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్, స్మార్ట్‌ సిటీస్, స్టార్టప్స్, వర్క్‌ ఫ్రమ్‌ ఎనీవేర్, ఎల్రక్టానిక్స్‌ అంశాలపై ప్రధానంగా చర్చించారు. సదస్సులో సెయింట్‌ సంస్థ ఎండీ సీఈవో కృష్ణ బోధనపు, శామ్‌సంగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌రావు, ఫేస్‌బుక్‌ ఎక్స్‌ప్రెస్‌ వైఫై హెడ్‌ సతీష్‌ మిట్టల్, గూగుల్‌ క్లౌడ్‌ హెడ్‌ ప్రతిక్‌ మోహతా, ఎ్రఫ్టానిక్స్‌ ఎండీ డి.రామకృష్ణ, మైక్రోమాక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భారత్‌ మాలిక్, అవేరా ఎనర్జీ సీఈవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top