సత్ఫలితాలిస్తున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం 

Good Result With YSR Sampoorna Poshana Scheme - Sakshi

పిల్లలు, గర్భిణులు, బాలింతలలో  రక్తహీనత నివారణ

జిల్లాలో 7,335 మంది గర్భిణులు,  8,266 మంది బాలింతలకు లబ్ధి

పార్వతీపురం టౌన్‌: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది. పేదరికంతో గర్భిణులు సరైన పైష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురవుతున్నారు. వారికి పుట్టిన బిడ్డలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం అదనపు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. రెండేళ్ల కిందట వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలులోకి తెచ్చింది. గర్భిణులకు గతంలో ఇచ్చే పప్పు, పాలు, గుడ్లకు అదనంగా మరో ఆరు రకాల పోషక పదార్థాలను అందించడంతో వారిలో రక్తహీనత తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తున్నారు. 

గర్భిణులకు ‘సంపూర్ణ పోషణ’   
గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోంది. కిలో రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల వేరుశనగ చక్కి, కిలో జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కిలోల ఫోర్టిఫైడ్‌ రైస్, అరకిలో నూనె, అరకిలో పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లతో కూడిన కిట్టలను అందజేస్తోంది. వీటన్నింటినీ డ్రైరేషన్‌గా లబ్ధిదారులకు ప్రతీనెలా సరఫరా చేస్తోంది.
  
పిల్లల ఆరోగ్యం కోసం...  
ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సుగల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలమృతం, రెండున్నర లీటర్ల పాలు, 25 కోడిగుడ్లను ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం సమకూర్చుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహరాన్ని వంటచేసి పిల్లలకు వడ్డిస్తోంది.  

మెనూ ఇది..  
చిన్న పిల్లలకు సోమవారం, గురువారాల్లో పౌష్టికా హారం, కూరగాయల కూర, సాంబారు, కోడిగుడ్డు కూర, వంద లీటర్లపాలు, మంగళవారం, శుక్రవారా ల్లో పౌష్టికాహారం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్‌ పాలు, బుధ, శనివారాల్లో పౌష్టికాహారం, వెజిటబుల్‌ రైస్, పులిహోరా, గోంగూర కూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్‌ పాలుతో కూడిన మెనూను అమలు చేస్తున్నారు.  

మా బాబు బరువు పెరిగాడు..  
మా  బాబు చాలా తక్కువ బరువు ఉండేవాడు. మొదటి సంవత్సరం మా అబ్బాయి బరువు 8 కేజీ లు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, పాలు తదితర బలవర్ధక పదార్థాలతో ఏడాదిన్నర కాలంలో 11 కేజీలకు బరువు పెరగడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్య ఆహారం అందిస్తున్న ప్రభుత్వానికి మాలాంటి తల్లుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు.  
– దివ్య, పాలకొండ మండలం, బుప్పూరు 

పౌష్టికాహారంతో ఆరోగ్యం  
గర్భిణిగా మూడో నెలనుంచి మాకు సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పథకం కింద పౌష్టికాహారం తీసుకుంటున్నా ను. ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతీనెల అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే వివిధ రకాల పోషకాహార వస్తువులను క్రమంతప్పకుండా తీసుకుంటున్నాను.  
– దీప్తి పండా, పార్వతీపురం పట్టణం 

జిల్లాలో 15,601 మందికి లబ్ధి 
జిల్లాలోని 15 మండలాల్లో ని గర్భిణులు, బాలింతలు 15,601 మందికి లబ్ధి చేకూరుతోంది. గర్భిణుల కు మూడోనెల నుంచి ప్రసవించేవరకు ప్రభుత్వం అందించే వైఎస్సార్‌ పోషణ కిట్లతో పాటు ఐరన్‌ మాత్రలు తీసుకున్న వారిలో 9 శాతం ఉన్న హిమోగ్లోబిన్‌ 11 శాతాని కి పెరిగింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం వల్ల పిల్లల్లో బరువు పెరగడమే కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారు.  
– వరహాలు, పీడీ ఐసీడీఎస్, పార్వతీపురం మన్యం జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top