సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి. OD 10S 6754 బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టు వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీంతో, ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనల కారణంగా మృతుల కుటుంబాలు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నాయి.



