breaking news
health andhrapradesh
-
సత్ఫలితాలిస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం
పార్వతీపురం టౌన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది. పేదరికంతో గర్భిణులు సరైన పైష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురవుతున్నారు. వారికి పుట్టిన బిడ్డలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం అదనపు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. రెండేళ్ల కిందట వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలులోకి తెచ్చింది. గర్భిణులకు గతంలో ఇచ్చే పప్పు, పాలు, గుడ్లకు అదనంగా మరో ఆరు రకాల పోషక పదార్థాలను అందించడంతో వారిలో రక్తహీనత తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తున్నారు. గర్భిణులకు ‘సంపూర్ణ పోషణ’ గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోంది. కిలో రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల వేరుశనగ చక్కి, కిలో జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కిలోల ఫోర్టిఫైడ్ రైస్, అరకిలో నూనె, అరకిలో పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లతో కూడిన కిట్టలను అందజేస్తోంది. వీటన్నింటినీ డ్రైరేషన్‌గా లబ్ధిదారులకు ప్రతీనెలా సరఫరా చేస్తోంది. పిల్లల ఆరోగ్యం కోసం... ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సుగల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలమృతం, రెండున్నర లీటర్ల పాలు, 25 కోడిగుడ్లను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సమకూర్చుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహరాన్ని వంటచేసి పిల్లలకు వడ్డిస్తోంది. మెనూ ఇది.. చిన్న పిల్లలకు సోమవారం, గురువారాల్లో పౌష్టికా హారం, కూరగాయల కూర, సాంబారు, కోడిగుడ్డు కూర, వంద లీటర్లపాలు, మంగళవారం, శుక్రవారా ల్లో పౌష్టికాహారం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు, బుధ, శనివారాల్లో పౌష్టికాహారం, వెజిటబుల్ రైస్, పులిహోరా, గోంగూర కూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలుతో కూడిన మెనూను అమలు చేస్తున్నారు. మా బాబు బరువు పెరిగాడు.. మా బాబు చాలా తక్కువ బరువు ఉండేవాడు. మొదటి సంవత్సరం మా అబ్బాయి బరువు 8 కేజీ లు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, పాలు తదితర బలవర్ధక పదార్థాలతో ఏడాదిన్నర కాలంలో 11 కేజీలకు బరువు పెరగడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్య ఆహారం అందిస్తున్న ప్రభుత్వానికి మాలాంటి తల్లుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దివ్య, పాలకొండ మండలం, బుప్పూరు పౌష్టికాహారంతో ఆరోగ్యం గర్భిణిగా మూడో నెలనుంచి మాకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పథకం కింద పౌష్టికాహారం తీసుకుంటున్నా ను. ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతీనెల అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే వివిధ రకాల పోషకాహార వస్తువులను క్రమంతప్పకుండా తీసుకుంటున్నాను. – దీప్తి పండా, పార్వతీపురం పట్టణం జిల్లాలో 15,601 మందికి లబ్ధి జిల్లాలోని 15 మండలాల్లో ని గర్భిణులు, బాలింతలు 15,601 మందికి లబ్ధి చేకూరుతోంది. గర్భిణుల కు మూడోనెల నుంచి ప్రసవించేవరకు ప్రభుత్వం అందించే వైఎస్సార్ పోషణ కిట్లతో పాటు ఐరన్ మాత్రలు తీసుకున్న వారిలో 9 శాతం ఉన్న హిమోగ్లోబిన్ 11 శాతాని కి పెరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం వల్ల పిల్లల్లో బరువు పెరగడమే కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారు. – వరహాలు, పీడీ ఐసీడీఎస్, పార్వతీపురం మన్యం జిల్లా -
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
రాజపూడి పీహెచ్సీ ప్రారంభోత్సవంలో మంత్రి కామినేని జగ్గంపేట : రాష్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాజపూడి గ్రామంలో రూ.78.15 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఉచిత వైద్య పరీక్షల కేంద్రాల ద్వారా రాష్ట్రంలో సుమారు కోటి మంది పరీక్షలను చేయించుకున్నారన్నారు. మాతాశిశుమరణాలు చోటు చేసుకుంటుండడంతో 16వేల మందికి ట్యాబ్‌లు అందించి ఆన్లైన్లో తల్లీబిడ్డల సమాచారం నిక్షిప్తం చేస్తున్నామన్నారు. తద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఆస్పత్రులలో కాన్పు తరువాత ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేస్తున్నామన్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసం పీహెచ్సీలలో 19, సీహెచ్సీలలో 40, రాజమహేంద్రవరం వంటి ఆస్పత్రులలో 63 పరీక్షల వరకు నిర్వహిస్తున్నామన్నారు. డెలివరీకి ముందు నాలుగు సార్లు పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్యం కోసం పట్టణాలలో 222 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కొత్తగా 1400 మంది డాక్టర్లను తీసుకున్నామని, ఇంకా 500 మందిని నియమిస్తామన్నారు. 108వాహనాలు కొత్తవి తీసుకుంటున్నామని, 104 వాహన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం జగ్గంపేట సీహెచ్‌సీని సందర్శించి రోగుల వివరాలడిగి తెలుసుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాజపూడి పీహెచ్సీలో 11మంది సిబ్బందిని నియమించామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ రాజపూడి, చుట్టు పక్కల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. డీఎం అండ్‌హెచ్‌ఓ కె.చంద్రయ్య మాట్లాడుతూ ఈ పీహెచ్సీ రాజపూడి, మన్యంవారిపాలెం, జె.కొత్తూరు, వెంగాయ్యమ్మపురం, మల్లిసాల తదితర గ్రామాల పరిధిలో 25వేల మందికి అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యులు జ్యోతుల నవీన్‌కుమార్, పాలూరి బోస్, వీరంరెడ్డి కాశీ, ఎంపీపీలు గుడేల రాణి, కంచుమర్తి రామలక్ష్మి, హౌసింగ్ బోర్డు డైరెక్టర్ కందుల కొండయ్యదొర, కోర్పు లచ్చయ్యదొర, సర్పంచ్ నంగన సత్యనారాయణ, అత్తులూరి సాయిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, బీజేపీ నాయకులు సూర్యనారాయణరాజు, వత్సవాయి వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు.