కిడ్నాప్ కోణంలో ఆధారాల్లేవన్న ఎస్పీ
అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు
అడవిలో థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లతో గాలింపు
కొనసాగుతున్న చిన్నారి మిస్సింగ్ మిస్టరీ
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికీ తెలియరాలేదు. చిన్నారి అదృశ్యమై సోమవారానికి పదోరోజు కావడం గమనార్హం. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హనుమాన్ టీమ్, ఫారెస్టు, పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురవడంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది.
ఆయిల్‌పామ్ తోటలో పచ్చిగడ్డి తొలగిస్తే ఏమైనా ఆనవాళ్లు లభిస్తాయేమోనని గడ్డి తొలగిస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ ఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలను సమీక్షిస్తున్నారు. అనుమానితులను, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా స్థానికులను, అటుగా రాకపోకలు సాగించిన వ్యక్తులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. తమ కుమార్తె క్షేమంగా ఇంటికి వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారు.
థర్మల్ డ్రోన్ల ప్రవేశం
అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను గుర్తించేందుకు ఫారెస్టు అధికారులు «థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లను వినియోగించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కాకినాడ రేంజర్ శ్రీదీప్తి ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి వచ్చిన హనుమాన్ టీమ్, ఫారెస్టు అధికారులు నాలుగు ప్రదేశాల్లో ట్రాకర్లు అమర్చారు. మరోపక్క పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు వారం రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ నివేదికపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కిడ్నాప్ కోణంలో లభించని ఆధారాలు
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గ్రామాన్ని పరిశీలించి, చిన్నారి తల్లిదండ్రులైన సుంకర గణేష్ , భవానీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి కిడ్నాప్‌కు గురైందనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. పెంపుడు కుక్క మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ జరుగుతోందన్నారు. చిన్నారి ఆచూకీని గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువుల్లో మరింత ఆందోళన, అభద్రతా భావాన్ని పెంచుతున్నారన్నారు. ప్రజలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి, అధికారిక సమాచారాన్ని చేరవేయాలన్నారు.


