టీడీపీ నేత వినోద్‌ జైన్‌కు జీవిత కాల శిక్ష.. బాలిక తాత, తల్లి స్పందన ఇదే..

Girl Grandfather Reaction On Life Sentence To Tdp Leader Vinod Kumar Jain - Sakshi

సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపులతో బాలికను చిదిమేసిన టీడీపీ నాయకుడు వినోద్‌ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు.

ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిచింది. కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక.. అమ్మ, నాన్న, తమ్ముడి గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఆ ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్‌ నోట్‌లో బంధాలు, బాంధవ్యాల గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్‌ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’ అని ఆకాంక్షించింది.

వినోద్‌కుమార్‌ జైన్‌కు సెక్షన్‌ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’తో బాలిక తాత మాచాలరావు, తల్లి మాధురి మాట్లాడారు. ‘‘ పాపకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ లోటస్ అపార్ట్‌మెంట్‌లో అడుగు పెట్టాం. టీడీపీ నేత వినోద్ జైన్ నా మనమరాల్ని అత్యంత దారుణంగా చిత్ర హింసలకు గురి చేశాడు. ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో అనే భయంతో పాప అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవితకాల శిక్ష పడటం చాలా సంతోషంగా ఉంది. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించడు. చట్టం, న్యాయం గెలిచింది. పైనున్న పాప ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు.
చదవండి: టీడీపీ నేత వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష

‘‘రాజకీయంగా ఉన్న పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు వినోద్‌కుమార్‌ జైన్‌ ప్రయత్నించాడు. కేసులో త్వరగా ట్రయల్స్ పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. కేసులో వేగవంతమైన విచారణ జరిపినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సీఎం చొరవతోనే ఈ కేసు వేగంగా ముందుకు కదిలింది. నిందితుడికి శిక్ష పడాలని ర్యాలీలు చేసిన విద్యార్థులకు, స్థానికులకు, లాయర్లకు కృతజ్ఞతలు. నిందితుడికి శిక్ష పడాలని పోరాటం చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి రోజా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు’’ అని వారు పేర్కొన్నారు.
చదవండి: 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top