రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. నగదు, ‘ప్రశంస’లు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. నగదు, ‘ప్రశంస’లు

Published Thu, Dec 2 2021 5:07 AM

Gautam Sawang says Good Samaritan award for support road accident victims - Sakshi

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసాయం అందించి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన ‘గుడ్‌ సమారిటన్‌’ అవార్డుల కోసం ఎంపిక కమిటీలను ప్రభుత్వం నియమించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీలో రవాణా శాఖ కమిషనర్, వైద్యారోగ్య శాఖ కమిషనర్, అదనపు డీజీ(రోడ్డు భద్రత) సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్‌/జిల్లా జడ్జి చైర్మన్‌గా ఉండే జిల్లా స్థాయి కమిటీలో జిల్లా ఎస్పీ, రవాణా శాఖ ఉప కమిషనర్, జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట(గోల్డెన్‌ అవర్‌)లోగా బాధితులను ఆస్పత్రికి తీసుకొచ్చిన వారికి రూ.5 వేల ప్రోత్సాహంతో పాటు ప్రశంస పత్రం అందించారు. రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు తక్షణ సమాచారం అందిస్తే.. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తికి పోలీసులు ‘గుడ్‌ సమారిటన్‌’ రశీదు ఇస్తారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆయన వివరాలు జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. 

జాతీయ స్థాయిలోనూ నగదు, ప్రశంస పత్రం 
రోడ్డు ప్రమాద బాధితులను నేరుగా ఆస్పత్రికే తీసుకొస్తే.. ఆస్పత్రి అధికారులు ‘గుడ్‌ సమారిటన్‌’ రశీదు ఇచ్చి ఆ వివరాలను పోలీస్‌స్టేషన్‌కు పంపుతారు. అక్కడ నుంచి జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. ఆ విధంగా వచ్చిన ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి నగదు బహుమతి, ప్రశంస పత్రాన్ని నెల రోజుల్లోగా అందిస్తాయి. ఏడాదిలో వచ్చిన ‘గుడ్‌ సమారిటన్‌’లలో అత్యంత విలువైన మూడు ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసి జాతీయ స్థాయి అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ విధంగా ఏడాదికి ఒకసారి దేశ వ్యాప్తంగా 10 అత్యుత్తమ ‘గుడ్‌ సమారిటన్‌’లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున పోత్సాహం, ప్రశంస పత్రం ఇస్తుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘గుడ్‌ సమారిటన్‌’ అవార్డుల ప్రక్రియను 2026, మార్చి 31 వరకూ కొనసాగించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకోసం జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను నియమించినట్టు డీజీపీ గౌతం సవాంగ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.   

5న 10కె, 5కె మారథాన్‌
తాడేపల్లిరూరల్‌: ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న 10కె, 5కె రన్‌ పోస్టర్లను డీజీపీ గౌతమ్‌ సవాంగ్, అదనపు డీజీపీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌లు బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మణిపాల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి, అమరావతి రన్నర్స్, రెడ్‌ ఎఫ్‌ఎం ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి రన్నర్స్, రెడ్‌ ఎఫ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌ వారి సహకారంతో మణిపాల్‌ హాస్పిటల్‌ 15వ వార్షికోత్సవం సందర్భంగా సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి డిసెంబర్‌ 5న విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలో గెలుపొందిన వారికి భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ చేతుల మీదుగా నగదు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. పోటీలో పాల్గొనదలచిన వారు 9618558989, 7569304232 నంబర్లకు ఫోన్‌ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement