ఆలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నాం 

Gautam Sawang Comments On Security Of Temples - Sakshi

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ..

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

గ్రామాల శివార్లలోని ఆలయాలపై మరింత నిఘా 

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాలన్నీ సర్వే చేసి జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ, రాష్ట్ర దేవాలయాల పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆలయాల్లో వరుసగా ఘటనలు జరుగుతుండటంతో పోలీస్‌ విభాగం అప్రమత్తమై.. దేవాలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. 13 జిల్లాల్లో ఉన్న 59 వేల ఆలయాలను సర్వే చేసి.. వాటికి జియో ట్యాగింగ్‌ చేశామని చెప్పారు. 47,734 ఆలయాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 23,832 ఆలయాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.     

ఆలయాల్లో ఘటనలకు సంబంధించి.. 1,893 మందిని విచారించామని తెలిపారు. 198 కేసుల్లో 373 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలే మూలమన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పాలక మండళ్లు, ఈవోలు చర్చించుకుని ఆలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలయాల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జునరావు సూచించారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలతో పాటు పురాతన ఆలయాలపై తగిన నిఘా ఉంచాలన్నారు.

దేవదాయ అడిషనల్‌  కమిషనర్‌ రామచంద్రమోహన్‌ మాట్లాడుతూ.. కార్యనిర్వహణ అ«ధికారులు, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న డీజీపీ సవాంగ్‌కు దుర్గగుడి ఈవో సురే‹Ù.. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు డీజీపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తుల శ్రీనివాసులు, సిట్‌ అధికారి జీవీజీ అశోక్‌కుమార్, టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీ డి.పాల్‌రాజ్, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top