
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరగనున్న గరుడసేవకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశముంది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి ఒంటి గంట వరకు వాహనసేవ సాగేలా ప్రణాళిక రూపొందించారు.
నిరంతరాయంగా అన్న ప్రసాదాలు
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. గ్యాలరీల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు పులిహోర, టమాట బాత్, బిసిబిల్లా బాత్ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు.
పటిష్ట బందోబస్తు
బ్రహ్మోత్సవాలకు దాదాపు 1,130 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత కలి్పంచారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శనివారం సాయంత్రం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది.