నకిలీ బంగారంతో ప్రైవేటు బ్యాంకుకు టోకరా 9 మంది అరెస్ట్‌ | Gang of 9 held for duping banks by pledging fake gold | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారంతో ప్రైవేటు బ్యాంకుకు టోకరా 9 మంది అరెస్ట్‌

Jun 27 2025 4:46 AM | Updated on Jun 27 2025 4:46 AM

Gang of 9 held for duping banks by pledging fake gold

నార్పల: మండల కేంద్రంలోని కీర్తన ప్రైవేట్‌ గోల్డ్‌ లోన్‌ బ్యాంకులో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.లక్షల రుణం పొందిన మోసగాళ్లను అనంతపురం జిల్లా నార్పల పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పట్టుపడిన వారిలో నార్పలకు చెందిన మహమ్మద్‌ ఇమ్రాన్, దాదాపీర్, కంసాల మంజునాథ్, షేక్‌ మహబూబ్‌ బాషా, షేక్‌ అబ్దుల్‌ రజాక్, షేక్‌ సాదిక్‌ వలి, బాబు, షేక్‌ యూసుఫ్‌ బాషా ఉన్నారు. వీరు 125.8 గ్రాముల నకిలీ బంగారాన్ని కీర్తన ప్రైవేట్‌ గోల్డ్‌ లోన్‌ బ్యాంకులో తనఖా పెట్టి ఆ బ్యాంక్‌ అధికారి మహమ్మద్‌ షఫీతో కలిసి రూ.9.46 లక్షలు రుణం తీసుకున్నారు.

బ్యాంక్‌ క్లస్టర్‌ మేనేజర్‌ కొలంట్ల నాగరాజు ఇటీవల ఆడిటింగ్‌ చేపట్టగా తాకట్టు పెట్టిన బంగారం నకిలీదిగా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణ కొనసాగుతుండగానే గురువారం మరోసారి అదే తరహాలో మోసం చేయడానికి నిందితులు ప్రయత్నించారు. విషయాన్ని గుర్తించిన మేనేజర్‌ అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి ఉడాయించారు.

సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి నార్పల క్రాస్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 నకిలీ బంగారు గాజులు, రెండు కడియాలు, మూడు ఉంగరాలు, ఓ ద్విచక్ర వాహనం, షిఫ్ట్‌ డిజైర్‌ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement