అక్కడ చదివి..ఇక్కడ చతికిలబడి.. | Future is uncertain with substandard foreign medical education | Sakshi
Sakshi News home page

అక్కడ చదివి..ఇక్కడ చతికిలబడి..

Nov 13 2026 5:51 AM | Updated on Nov 13 2026 5:51 AM

Future is uncertain with substandard foreign medical education

ప్రమాణాల్లేని విదేశీ వైద్య విద్యతో భవిష్యత్తు అగమ్యగోచరం

అక్టోబర్‌ 2026 ఎఫ్‌ఎంజీఈ ఫలితాల్లో 77.13 శాతం మంది ఫెయిల్‌

దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన 40,923 మంది విద్యార్థులు

వీరిలో పాసైంది కేవలం 9,354 మందే

ఏపీలోనూ వైద్య విద్య అవకాశాల్లేక వేలాది మంది విదేశీ బాట 

భారత ప్రమాణాలను అందుకోలేక విదేశీ ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్ల అవస్థలు

ఏటా ఇలా అధిక శాతం ఫెయిల్‌ అవుతున్నా కళ్లు తెరవని చంద్రబాబు సర్కారు

కొత్త మెడికల్‌ కాలేజీలపై కుట్రలతో 2024 నుంచి 3,500 సీట్లు పోగొట్టిన దుస్థితి

సాక్షి, అమరావతి: సొంత రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేక, ప్రైవేట్‌ కాలేజీల్లో భారీ ఫీజులు కట్టలేక.. విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్న మన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో సరైన క్లినికల్‌ శిక్షణ, ప్రమాణాల్లేని మెడిసిన్‌ కోర్సు చదివి మన దేశ వైద్య ప్రమాణాలను వారు అందుకోలేకపోతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తయిన వారు మన దేశంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ)లో గట్టెక్కలేకపోతున్నా­రు. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) అక్టోబర్‌–2026 ఫలితాలే ఇందుకు నిదర్శనం. 

ఈ పరీక్షలో ఏకంగా 77 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్‌ కావడం వైద్య విద్యారంగంలో నెలకొన్న దుస్థితికి అద్దంపడుతోంది. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన 40,923 మంది ఎఫ్‌ఎంజీఈకి హాజరుకాగా.. వీరిలో కేవలం 22.87 శాతం అంటే.. 9,354 మంది మాత్రమే పాసయ్యారు. ఈ పరీక్షల్లో ఏటా ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఈ క్రమంలో మెడిసిన్‌ చదువు కోసం విదేశీ వలసలు అరికట్టడానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఛిద్రం చేసి మన విద్యార్థుల భవిష్యత్తును చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటైతే రాష్ట్రంలో సమృద్ధిగా ఎంబీబీఎస్‌ సీట్లు సమకూరే పరిస్థితులుండగా ఆ కళాశాలలను ప్రారంభించకుండా కుట్రలు పన్నింది. ఫలితంగా 2024 నుంచి ఇప్పటివరకూ మొత్తం 3,500 ఎంబీబీఎస్‌ సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు.

ఏటా మూడు వేల మంది విదేశీ బాట..
రాష్ట్రంలో ఏటా నీట్‌ యూజీలో అర్హత సాధించిన 14 వేల మంది విద్యార్థులు కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వైద్య విద్యకు ఉన్న డిమాండ్‌కు సరిపడా కన్వీనర్‌ సీట్లు అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద భారీ ఫీజులు చెల్లించే స్థోమతలేని కుటుంబాల విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు. ఏపీలోని ప్రైవేట్‌ కాలేజీల్లో కంటే తక్కువ ఫీజులుంటాయనే కారణంగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపుతున్నారు. రష్యా, చైనా, ఉక్రెయిన్, నేపాల్, బంగ్లాదేశ్, కజకిస్తాన్, అర్మేనియా, జార్జియా వంటి దేశాలను ఆశ్రయిస్తున్నారు. 

ఈ దేశాలకు ఏపీ నుంచి ఏటా మూడువేల మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదవడానికి వెళ్తుంటారని అంచనా. అయితే, భారత్‌తో పోలిస్తే ఆయా దేశాల్లో వైద్య విద్య ప్రమాణాలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. పాఠ్య ప్రణాళికలో వ్యత్యాసం ఉంటోంది. మన దగ్గర పాఠ్యాంశాల్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వంటి అంశాలపై విదేశీ విశ్వవిద్యాలయాల్లో తక్కువ అవగాహన ఉండటం విద్యార్థులకు ఇబ్బందిగా మారుతోంది. అంతేకాక.. భారత్‌లో విద్యార్థులకు క్లినికల్‌ అనుభవం ఎక్కువగా వస్తుంది. 

విదేశాల్లో అది తక్కువగా ఉండడంతో విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కొరవడుతోందన్న అభిప్రాయాలున్నాయి. దీంతో అక్కడ ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక భారత్‌లో ప్రాక్టీస్‌ చేయడంతోపాటు, పీజీ చదవడానికి అర్హత సాధించడానికి నిర్వహించే ఎఫ్‌ఎంజీఈలో విదేశాల్లో చదువుకున్న వైద్య విద్య గ్రాడ్యుయేట్స్‌ రాణించలేకపోతున్నారు. ఎఫ్‌ఎంజీఈలో గట్టెక్కాక ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మన దగ్గర ఏడాది లేదా రెండేళ్లు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే వివాదం చెలరేగి ఏపీ మెడికల్‌ కౌన్సెల్‌లో రిజిస్ట్రేషన్ల కోసం కొద్దినెలల కిందట ఎఫ్‌ఎంజీలు విజయవాడలో ధర్నాలు చేశారు. 

చంద్రబాబు రాక విద్యార్థులకు పెనుశాపం..
ఇక రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా సీట్లులేక మన విద్యార్థులకు వైద్య విద్యకు దూరం కాకూడదని.. విదేశీ వలసలు, కోర్సులు పూర్తయ్యాక ఎదురయ్యే కష్టాలను  నిరోధించేలా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేపట్టింది. అయితే, 2024లో చంద్రబాబు గద్దెనెక్కడం రాష్ట్రంలో వైద్య విద్య ఆశావహులకు పెనుశాపంగా మారింది. నిధులలేమి సాకును బూచిగా చూపి బాబు సర్కారు కొత్త కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి పూనుకుంది. 

ఇందులో భాగంగా ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చినా పులివెందుల వైద్య కళాశాలను ప్రారంభించకుండా కుట్రలు పన్నింది. దీంతోపాటు, మరో తొమ్మిది కాలేజీలు ప్రారంభించకుండా విద్యార్థులకు తీవ్రనష్టం చేసింది. ఫలితంగా 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 సీట్లు, 2026–27లో 1,050 చొప్పున మొత్తం మూడేళ్లలో 3,500 ఎంబీబీఎస్‌ సీట్లు రాష్ట్రానికి దక్కకుండా పోయాయి. దీంతో వైద్య విద్య అవకాశాలు కోల్పోయిన విద్యార్థులు అప్పుచేసి విదేశాలకు వెళ్తే.. అక్కడ కనీసస్థాయి ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లేని చదువులతో ఇక్కడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మానసిక క్షోభకు గురవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement