ఎటుచూసినా విషాదం | Funerals held with tears for those killed in steel plant accident | Sakshi
Sakshi News home page

ఎటుచూసినా విషాదం

Jun 10 2026 4:16 AM | Updated on Jun 10 2026 4:16 AM

Funerals held with tears for those killed in steel plant accident

స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద మృతులకు అశ్రునయనాలతో అంత్యక్రియలు  

అగనంపూడి/గాజువాక/గోపాలపట్నం/అక్కిరెడ్డిపాలెం/ఉక్కునగరం/పెదగంట్యాడ: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఏడుగురి మృతదేహాలకు కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మేనేజర్‌ గోల్డ్‌ కుమార్‌ మృతదేహం కేజీహెచ్‌ మార్చురీలోనే ఉంది. అతడి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ స్టీల్‌ మెల్ట్‌ షాప్‌–1 (ఎస్‌ఎంఎస్‌–1)లో సోమవారం 150 టన్నుల ద్రవపు ఉక్కు పేలిపోయి జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిదిమంది మరణించిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో పోస్టుమార్టం తర్వాత వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి వద్ద, మృతదేహాలను తీసుకెళ్లిన తరువాత వారి ఇళ్లు, ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదకర వాతావరణం నెలకొంది. ప్రమాదంలో కాలిపోవడంతో మృతదేహాలను కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకపోయిందంటూ వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

కన్నీరుమున్నీరైన కృష్ణనాగు కుటుంబం 
ఈ ప్రమాదంలో ఎం.కృష్ణనాగు మృతిచెందడంతో కనకమహాలక్ష్మీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువచ్చారు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రమాదంలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహానికి కప్పిన కవర్‌ను తొలగించలేదు. దీంతో చివరి చూపునకు కూడా నోచుకోలేదంటూ కుటుంబసభ్యులు విలపించడం అందరినీ కలచివేసింది. కృష్ణనాగు మృతదేహానికి బుచి్చరాజుపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  

30 ఏళ్లు కాంట్రాక్టు కార్మికుడిగా..  
ఈ ప్రమాదంలో మృతిచెందిన అప్పన్నకాలనీకి చెందిన గొట్టపు త్రినాథ్‌ (50) 30 ఏళ్ల కిందట స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా చేరారు. ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో కాలనీలో విషాదం నెలకొంది. మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదన అందరికంట తడి పెట్టించింది. బొబ్బిలి సమీపంలోని గాదెలవలస గ్రామానికి చెందిన త్రినాథ్‌ ఉపాధి కోసం విశాఖకు వచ్చి అప్పన్నకాలనీలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పవన్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా, చిన్న కుమారుడు భరత్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. స్థానిక శ్మశానవాటికలో త్రినాథ్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

పెదగంట్యాడ మండలంలో విషాదం
ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం పెదగంట్యాడ మండలానికి చెందిన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 77వ వార్డు పరిధిలోని మదీనాబాగ్‌ సత్తర్‌ కాలనీకి చెందిన నక్క వెంకటరమణ (54), 75వ వార్డు పరిధిలోని నీలాపువీధికి చెందిన  గొందేశి వెంకట అప్పారావు (41) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్న నక్క వెంకటరమణకు భార్య జోగమ్మ, కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె అప్పలకొండ ఉన్నారు. ప్రగతి మైదానం వద్ద వెంకటరమణ పార్థివదేహానికి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు నివాళులర్పించారు.

మాకు దిక్కెవరు? 
నీలాపువీధికి చెందిన మృతుడు వెంకట అప్పారావుకు తల్లి దాలమ్మ, భార్య భారతి, కుమారులు ధనుష్, లోకేశ్‌ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో తపనపడే అప్పారావు మృతి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ ఆ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.  

మార్చురీలోనే గోల్డ్‌కుమార్‌ మృతదేహం 
స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌–1లో మేనేజర్‌గా పనిచేస్తూ ఈ ప్రమాదంలో మృతిచెందిన గోల్డ్‌ కుమార్‌ మృతదేహం కేజీహెచ్‌ మార్చురీలోనే ఉంది. స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేసవి సెలవులకు సొంత రాష్ట్రం బిహార్‌ వెళ్లిన వారు ఈ దుర్ఘటన విషయం తెలిసి వెంటనే బయల్దేరారు. వారు వచి్చన అనంతరం మృతదేహాన్ని అధికారులు అప్పగించనున్నారు.  

కాలిలో రాడ్డుతో మృతదేహం గుర్తింపు  
ఈ ప్రమాదంలో మరణించిన గాజువాక సీతారామ్‌నగర్‌ నివాసి కూన ప్రభాకరరావుకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ప్రసాద్‌ కాకినాడలో డాక్టర్‌గా పనిచేస్తుండగా మరో కుమారుడు లోకేశ్‌ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ప్రభాకరరావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన ఆయనకు వైద్యులు ఒక కాలిలో రాడ్డు వేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో మృతులను గుర్తిస్తున్న వైద్యులు...ప్రభాకరరావును ఆ రాడ్డు ఆధారంగానే గుర్తించారు. తన భర్తకు కాలిలో రాడ్డు ఉంటుందని అరుణ చెప్పడంతో దాని ఆధారంగా వైద్యులు ఆయన పార్థివదేహాన్ని నిర్ధారించారు.  

తనదికాని షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లి..  
ఈ ప్రమాదంలో అగనంపూడి ప్రాంతానికి చెందిన ఇద్దరు కార్మికులు మృత్యువాత పడడంతో స్థానిక నిర్వాసిత కాలనీలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అగనంపూడి సెక్టార్‌–3 పరిధిలోని శనివాడ కాలనీకి చెందిన గొంతిన భానుకుమార్‌ (33), డొంకాడ కాలనీకి చెందిన నక్కా అప్పలరాజు మృతిచెందారు. ఎస్‌ఎంఎస్‌–1 విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భానుకుమార్‌ వాస్తవానికి ‘సీ’ షిఫ్ట్‌కు వెళ్లాల్సి ఉంది. ఒక మిత్రుడి కోరిక మేరకు ‘బీ’ షిఫ్ట్‌కు డ్యూటీకి వెళ్లారు. 

డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. భానుకుమార్‌కు మూడేళ్ల కిందట శ్రీనగర్‌కు చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వారికి మూడునెలల కుమారుడు ఉన్నాడు. భానుకుమార్‌ భౌతికకాయాన్ని అంతిమయాత్రగా తలారివానిపాలెం కైలాసభూమికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. భర్తను కడసారి చూసేందుకు శ్మశానవాటికకు వచి్చన లావణ్య కుప్పకూలిపోవడం అందరినీకంట తడిపెట్టించింది.  

ఆధారం కోల్పోయిన కుటుంబం
అగనంపూడి నిర్వాసిత కాలనీ డొంకాడకు చెందిన నక్కా అప్పలరాజు కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అధికారుల నుంచి సమాచారం రావడంతో ‘బీ’ షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య మణి, కుమారుడు వరప్రసాద్‌ (12), కుమార్తె హేమశ్రీ (10), వృద్ధ తల్లిదండ్రులు అప్పారావు, అప్పలనర్సమ్మ ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన అప్పలరాజు మరణంతో తమకు దిక్కెవరంటూ వృద్ధ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు బోరున విలపిస్తుండటం స్థానికులను కలచివేసింది. అప్పలరాజు మృతదేహానికి అగనంపూడి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement