
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లలో ప్రవేశాలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనగా అనాధ, దివ్యాంగ బాలలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు (బీసీ మైనారిటీ, ఓసీ) 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలోకి ఆయా పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని, లాటరీ పద్ధతిలో ఎంపికలు చేపడతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీనవర్గాల కుటుంబాలకు వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాల కుటుంబాలకు 1.40 లక్షలు ప్రాతిపదికగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 16 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. "http://cse.ap.gov.in' వెబ్‌సైటు ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశ దరఖాస్తుతో పాటు ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వివరించారు.