ఉర్సా భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా..? | Former Minister Gudivada Amarnath Challenge To Nara Lokesh | Sakshi
Sakshi News home page

ఉర్సా భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా..?

Jun 3 2025 5:31 AM | Updated on Jun 3 2025 1:29 PM

Former Minister Gudivada Amarnath Challenge To Nara Lokesh

మంత్రి లోకేశ్‌కు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రతి సవాల్‌

మొత్తం ఫైళ్లను బయటపెట్టాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: ఉర్సా భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం ఫైళ్లను బయటపెట్టడంతో పాటు ఈ అంశంపై  సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంత్రి నారా లోకేశ్‌కు సవాల్‌ విసిరారు. ఉర్సా భూముల వ్యవహారంలో మంత్రి  లోకేశ్‌ చేసిన సవాల్‌కు స్పందిస్తూ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి లోకేశ్‌కు పలు ప్రశ్నలు సంధించారు.

⇒ ఉర్సా కంపెనీకి విశాఖపట్నం ఐటీ హిల్‌లో ఎకరం కోటి రూపాయలకు మూడున్నర ఎకరాలు, కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున రూ.56.36 కోట్లకు కేటాయించామంటూ మీరు ప్రకటించడం ఏంటి? దీనికి సంబంధించిన జీఓ విడుదల కాకుండా ఇప్పుడు మీరు చెప్పడం ఏంటి? 

⇒ కుంభకోణం బయటపడ్డ దాదాపు 50 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు ప్రకటన చేయడం ఏంటి?  దీనివెనుక నడిచిన తతంగం ఏంటి?

⇒ ఉర్సాకు కేటాయించిన భూమి రేటు విషయమై యాభై రోజులుగా గప్‌చుప్‌గా వ్యవహరించిన మీరు, ఇవాళ అకస్మాత్తుగా మీ బినామీ కంపెనీ గత ఏప్రిల్‌ 21నాడు విడుదల చేసిన ప్ర­కట­నకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ వ్యవహారంలో మీరు మూసేయాల్సినవి మూసేశారా? ఫైళ్లు చింపేసినా, తగలబెట్టినా స్కిల్‌ స్కాం తరహాలో బయటకు వస్తాయి కదా?

⇒  మీరు 2024 అక్టోబర్‌ 25న అమెరికాకు వెళ్లారు. 2024 సెప్టెంబర్‌ 27న అమెరికాలో కంపెనీ రిజిస్టర్‌ అయ్యింది. 2025 ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది.  ఈ పరిణామాల వెనుక అసలు అర్థం ఏంటి? 

⇒  2025 ఏప్రిల్‌ 10న చంద్రబాబు అధ్యక్షతన  సమావేశమై గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేయడం, ఆ తర్వాత ఏప్రిల్‌ 15న కేబినెట్‌లో ఆమోదం వెంటవెంటనే జరిగిపోయాయి. ఏమిటీ మీకు అంత ప్రేమ?

⇒ రూ. 5,728 కోట్ల పెట్టుబడి పెడతామంటున్న ఈ కంపెనీ కేవలం 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ను, లక్ష రూపాయిల పెయిడప్‌క్యాపిటల్‌ను మాత్రమే కలిగి ఉండడం వెనుక అర్థం ఏంటి?  అలాంటి కంపెనీకి రూ.3వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా ఇవ్వడం ఏంటి? 

⇒ ఉర్సా చేసిన ప్రాజెక్టులు ఏంటి? ఆ కంపెనీ సృష్టించిన టెక్నాలజీ ఏంటి? మీరైనా చెప్పగలరా?
⇒  రూ.5 వేల కోట్ల కంపెనీ హైదరాబాద్‌లోని ఒక మిడిల్‌ క్లాస్‌ అపార్ట్‌మెంట్లో ఉంది. ఒక కుటుంబం ఎంత కరెంటు బిల్లు కడుతుందో అంతే మొత్తాన్ని ఈ కంపెనీ కడుతోంది. ఇలాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములను అప్పగించడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు?

⇒ ఉర్సాకు ఎకరా రూ.50 కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని అప్పనంగా ఇస్తున్నారు. మరి ఎవరికైనా ఇలాగే ఇస్తారా? 
⇒ ఉర్సా కంపెనీకి చెందిన సతీష్‌ అబ్బూరి 21 సెంచరీ ద్వారా ఎంతో మందిని మోసం చేశారని, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఇందులో పాలుపంచుకున్నాడని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై మీరెందుకు దర్యాప్తు చేయించడంలేదు. 

⇒ కేశినేని చిన్ని ద్వారా సతీష్‌ అబ్బూరితో ఈ కంపెనీని సృష్టించి దాని ద్వారా విశాఖలో విలువైన 60 ఎకరాలు కొట్టేశారన్న ఆరోపణలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement