చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
రూ.లక్ష కోట్లంటూ పిట్టలదొర మాటలు.. డ్రామాలు.. అంకెల గారడీలు
హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే.. రోజూ ధర్నాలు చేస్తే ఏరోజైనా పట్టించుకున్నారా?
వేలాది ఎకరాల్లో తోటలు ఎండిపోతుంటే వాటర్ మ్యాన్ అని బిల్డప్‌లా?
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి ప్రతి హామీ నెరవేరుస్తానని ఇంటింటికీ బాండ్లు పంచిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాలన మూడో ఏడాది నడుస్తోంది... ఇప్పుడు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ పిట్టలదొర మాటలు చెబుతూ మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా?
రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు చెబుతూ, మరోవైపు రైతులను లక్ష మోసాలకు గురి చేస్తున్నారు. రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ చంద్రబాబు చేస్తున్నవి డ్రామాలు, అంకెల గారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. రైతులమీద ప్రేమ మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనే పలుమార్లు రుజువు చేసింది.
హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటల బీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?. సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని నిర్వీర్యం చేసి రైతుల నడ్డివిరిచారు. చంద్రబాబు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు గానీ రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?
డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి.. కరువు నివారణా చర్యలు మొదలు పెట్టాలి
తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే... చంద్రబాబు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డుతగులుతున్నారు. మరోపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 78 లక్షల బోర్లు ఎండిపోయాయి.
ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబు ఇప్పటికైనా డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టాలి.


