ఫేస్‌బుక్‌ నా పరువు తీస్తోంది: దమ్మాలపాటి పిటిషన్‌

Former AG Dammalapati supplementary petition in the High Court - Sakshi

అమరావతి భూ కుంభకోణంపై పోస్టింగ్‌లు వస్తూనే ఉన్నాయి 

హైకోర్టులో మాజీ ఏజీ దమ్మాలపాటి అనుబంధ పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టును ఆశ్రయించి ఏసీబీ దర్యాప్తుపై స్టేతో పాటు మీడియా కథనాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా గ్యాగ్‌ ఆర్డర్‌ పొందిన మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాలతో పోస్టింగ్‌లు వస్తూనే ఉన్నాయని, వాటిని ‘విశ్వవ్యాప్తం’గా తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపైన, తన కుటుంబసభ్యులు, సన్నిహితులపైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కథనాలను వ్యాప్తిచేస్తూ దురుద్దేశపూర్వక ‘మీడియా ట్రయిల్‌’ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తును, నిందితుల హక్కులను ప్రభావితం చేసేలా మీడియా ట్రయిల్‌ ఉండరాదని మనుశర్మ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందంటూ ప్రస్తావించారు. (ఏసీబీ దర్యాప్తు మొదలు పెట్టకుండానే దమ్మాలపాటి హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చారు). సోషల్‌ మీడియా కథనాలతో తన పరువు ప్రతిష్టలకు నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ అనుబంధ వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.  (తమిళ పత్రిక కథనం: చంద్రబాబూ.. ఎందుకీ కడుపుమంట..?)

మేం ఆదేశాలిచ్చినా.. 
దమ్మాలపాటి న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు విన్న అనంతరం.. తాము ఆదేశాలిచ్చినా సోషల్‌ మీడియాలో పోస్టులెలా వస్తాయని జస్టిస్‌ మహేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ పోస్టుల తొలగింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ చెప్పారు. దమ్మాలపాటి ఫేస్‌బుక్‌ను ప్రతివాదిగా చేర్చకుండానే ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తర్వులు కోరుతున్నారన్నారు. తమ ఉత్తర్వుల అమలుకు కేంద్రానికి ఆదేశాలిస్తామని సీజే పేర్కొన్నారు. మరిన్ని వివరాల సమర్పణకు గడువు కావాలన్న ప్రణతి వినతికి సీజే అంగీకరించారు.   (రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు)

మీ ఎస్‌ఎల్‌పీ ఎంతవరకు వచ్చింది? 
హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ ఎంతవరకు వచ్చిందని సీజే ఆరా తీశారు. వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని సుమన్‌ చెప్పారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సీజే ఇచ్చిన మీడియా గ్యాగ్‌ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ న్యాయవాది మమతారాణి దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌పైన విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. దమ్మాలపాటి కౌంటర్‌ తమకు అందలేదని మమతారాణి న్యాయవాది పి.బి.సురేశ్‌ చెప్పడంతో «కౌంటర్‌ కాపీని వారికి ఇవ్వాలని ప్రణతికి సీజే సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top