
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల సమర్పణకు అపరాధ రుసుం లేకుండా చివరి గడువైన ఏప్రిల్ 15వ తేదీ నాటికే గత ఏడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు మించి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. ఆ తరువాత కూడా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది.
మంగళవారం నాటికి దరఖాస్తుల సంఖ్య 3,37,500కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే.. 12 శాతం మేర అభ్యర్థుల సంఖ్య పెరుగుతోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌తో పాటు అగ్రికల్చర్ స్ట్రీమ్‌లోనూ దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా దాఖలయ్యాయి. గత ఏడాది రూ.10 వేల అపరాధ రుసుంతో చివరి గడువు నాటికి మొత్తం దరఖాస్తులు 2.90 లక్షల వరకు మాత్రమే రాగా.. ఈసారి ఎక్కువగా దాఖలు అయ్యాయి.
అపరాధ రుసుంతో 14 వరకు గడువు
అపరాధ రుసుం రూ.వెయ్యితో ఈ నెల 5వ తేదీ వరకు గడువు ఉండగా.. రూ.5 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు గడువు విధించారు. మే 15వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు పెద్దఎత్తున దరఖాస్తులు అందడంతో పరీక్ష కేంద్రాల సంఖ్య, సీటింగ్ పరిస్థితిని అనుసరించి పరీక్షల షెడ్యూల్‌ను ఒకరోజు అదనంగా ఇంతకు ముందే పొడిగించారు.
వాస్తవానికి 15 నుంచి 18 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున మొత్తం 8 సెషన్లలో పరీక్షలను ముగించాలని ముందు భావించారు. అయితే, దరఖాస్తుల సంఖ్య పెరగడంతో పరీక్ష రాసేందుకు ఏర్పాటైన కంప్యూటర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థులను సర్దుబాటు చేసినా ఇంకా అదనంగా వేలాది మంది అభ్యర్థులు మిగిలి ఉంటున్నారు. ఈ తరుణంలో పరీక్షలను మరో రోజుకు కూడా పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో గతంలో 80వేల వరకు దరఖాస్తులు అందగా.. ఈసారి వాటి సంఖ్య 96 వేలకు చేరుకుంది. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలను మే 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. కాగా, ఈఏపీ సెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కలి్పంచి ర్యాంకులను ఇవ్వనున్నారు.
బీఎస్సీ నర్సింగ్ సీట్లూ ఈఏపీ సెట్ ద్వారానే భర్తీ
ఇప్పటివరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్న బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా 2023–24 విద్యాసంవత్సరం నుంచి ఈఏపీ సెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. దీంతో ఈ సీట్ల కోసం పోటీపడే విద్యార్థులు కూడా ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరుకానున్నారు.