ఆ 8 గంటలే కొంప ముంచాయి | Fishermen Familes Protest Against Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఆ 8 గంటలే కొంప ముంచాయి

Jul 8 2026 5:53 AM | Updated on Jul 8 2026 5:53 AM

Fishermen Familes Protest Against Chandrababu Govt

మత్స్యకారుడు చిన్నాను హెలికాప్టర్‌లోకి లాగుతున్న నేవీ సిబ్బంది

చంద్రబాబు సర్కారు తీరుపై మత్స్యకారుల ఆగ్రహం

వెంటనే రెస్క్యూ చేసి ఉంటే ఆరుగురూ దొరికేవాళ్లు

బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నాదీ అదే మాట

బోటు గల్లంతైనట్లు 4వ తేదీ రాత్రి 11.30గంటలకు సమాచారం

5వ తేదీ ఉదయం 8 తర్వాత రెస్క్యూ ప్రారంభం

ఈ విషయాన్ని వెల్లడించిన విశాఖ రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జెట్టి

రెవెన్యూ విభాగానికి రాత్రి 8.30 గంటలకే ప్రమాద సమాచారం

అయినా పట్టించుకోకుండా మిన్నకుండిపోయిన ప్రభుత్వం  

ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంపముంచిందని మత్స్యకారుల ఆగ్రహం

గాలింపు ముగిసిందని ప్రకటించిన అధికారులు

ఈ నెల 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు ప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే మరుసటి రోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించాం. – మీడియా సమావేశంలో మెరైన్‌ ఐజీ గోపినాథ్‌ జెట్టి

మాకు 5వ తేదీ ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.     – మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌ నాయక్‌

ఈ నెల 4న శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బోటు బోల్తా పడింది. 12 గంటల పాటు సముద్రంలో ఈది.. ఈది.. అలసిపోయాం. తెల్లారే వరకూ ఊపిరి బిగపట్టుకొని ఉన్నాం. రావాల్సిన బోటు ఎందుకు రాలేదనే అనుమానంతో గాలించేందుకు వస్తారు.. అప్పటి వరకు బతికే ఉండాలని అందరం అనుకున్నాం. కానీ.. ఎవరూ రాలేదు. దూరంగా కనిపించిన చైనా షిప్‌ వద్దకు నేను చేరుకునే సరికి ఆదివారం ఉదయం 9 గంటలైంది. కనీసం ఉదయం 6–7 గంటలకు మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటే నలుగురైదుగురం బతికేవాళ్లం.         –  బోటు ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన కారి చిన్నా  

సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట: సముద్రపు అలల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల పాలిట అత్యంత ప్రమాదకరంగా మారిందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆపదలో ఉన్నామని, తమ వారి జాడ దొరకడం లేదని రాత్రి గొంతు చించుకుని మొత్తుకున్నా.. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించక పోవడం వల్లే విషాద తీవ్రత పెరిగిందని వాపోతున్నారు.

వేటకు వెళ్లిన వారు ‘గంటలో వస్తాం’ అని చెప్పిన గంటకే.. ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ కావడంతో గుండెలు పగిలిన కుటుంబ సభ్యులు రాత్రి 11.30 గంటలకే అధికారులకు సమాచారం అందించారు. బోటు గల్లంతైన విషయం రాత్రే తెలిసిందని సాక్షాత్తూ విశాఖ రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జెట్టీ మీడియా సమావేశంలోనే వెల్లడించారు. అయినా సరే.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం.. ఉదయం 8 గంటల వరకూ రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టకుండా యంత్రాంగం నిద్ర నటించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ 8 గంటలే తమ కొంప ముంచాయని బాధిత మత్స్యకార కుటుంబాలు నిప్పులు చెరుగుతున్నాయి.    

రెవెన్యూ విభాగానికి ముందే తెలుసా? 
మెరైన్‌ విభాగానికి రాత్రి 11.30 గంటలకు సమాచారం అందితే.. రెవెన్యూ విభాగానికి అంతకు ముందే ప్రమాద సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 8.30 గంటలకు రెవెన్యూ విభాగానికి మత్స్యకారులు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. ముందు రోజు రాత్రి సమాచారం వస్తే.. మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టలేదన్న సందేహాలు నెలకొన్నాయి.

ఆ అత్యంత కీలకమైన 8 గంటల కాలాన్ని విపత్తులో చిక్కుకున్న ప్రాణాలను రక్షించడానికి కాకుండా ఎందుకు వృథా చేశారు? చీకట్లో సైతం గాలింపు చర్యలు చేపట్టే అత్యాధునిక రాడార్, హెలికాప్టర్‌ వ్యవస్థలు, కోస్ట్‌గార్డ్‌ దళాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు ఆ సమయంలో గాలింపు చర్యలు చేపట్టలేదు? వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి ఉంటే.. ఆ ఏడుగురూ ఇప్పుడు వారి ఇళ్లలో సురక్షితంగా ఉండేవారు కాదా అనే ప్రశ్నలు మత్స్యకారుల నుంచి దూసుకొస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రమాదం నుంచి బయటపడిన చిన్నా కూడా స్పష్టం చేశారు.   

మత్స్యకార కుటుంబాల ఆగ్రహ జ్వాల 
ప్రభుత్వ చేతకానితనం, అధికారుల ఘోర వైఫల్యమే తమ వారిని సముద్రం పాలు చేసిందంటూ మత్స్యకార కుటుంబాలు మత్స్యశాఖ జేడీ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. తమ వారి ఆచూకీ తెలియక పోవడానికి కారణమైన ఆ 8 గంటల నిర్లక్ష్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కళ్లెదుటే జరిగిన ఈ ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం హడావిడి మొదలుపెట్టింది. మత్స్యకారుల ఆచూకీ తెలిసేంత వరకు గాలింపు చర్యలు చేస్తామని చెప్పారు.   

ముగిసిన గాలింపు చర్యలు 
గాలింపు చర్యలు మొదలు పెట్టిన రోజు మత్స్యకార కుటుంబాలతో కలెక్టర్‌ అభిషేక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ.. గల్లంతైన వారు దొరికే వరకు గాలింపు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ.. మంగళవారం ఉదయం బాధిత కుటుంబాల్ని పరామర్శించిన మత్స్యశాఖ కమిషనర్‌ నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించిన 72 గంటల తర్వాత ఆపేస్తామని, తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయం, పునరావాస చర్యలు మొదలు పెడతామని ప్రకటించడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

మంగళవారం అర్థరాత్రి వరకూ రెండు కోస్ట్‌గార్డ్‌ నౌకలు, 3 నేవీ హెలికాప్టర్లు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాయి. కోస్టు గార్డు రీజినల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఐజీ గోపీనాథ్‌ జెట్టి ఈ ఆపరేషన్‌ని పర్యవేక్షించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినా, ఏ ఒక్క మత్స్యకారుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అన్వేషణ కొనసాగించాలని, తమ వాళ్లు దొరికే వరకూ ఆపొద్దని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

కానీ.. నిబంధన ప్రకారం 72 గంటల పాటు రెస్క్యూ చేపట్టామని, దీనికి అదనంగా మరో 6 గంటలు నిర్వహించామని.. ఆచూకీ దొరకనందున రెస్క్యూ ఆపరేషన్‌ నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బతికున్న వారినైనా కనిపెట్టండి.. లేదా చివరి చూపు కోసం వారి మృతదేహాలనైనా అన్వేషేంచి అప్పగించండని వేడుకుంటున్నాయి.    

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం 
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ రామ శంకర్‌ నాయక్‌ భరోసా ఇచ్చారు. మంగళవారం ఫిషింగ్‌ హార్బర్‌లోని మెకనైజ్డ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ భవనంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలింపు చర్యలు పూర్తయ్యాక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.

రెవెన్యూ, కార్మీక, మత్స్యశాఖల సమన్వయంతో సహాయం అందిస్తామని చెప్పారు. మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులతో కూడా చర్చించి, కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి కల్పించే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని తెలిపారు. ఏడుగురిలో ఒకరే ప్రాణాలతో బయట పడ్డాడని, మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారని చెప్పారు. చిన్నా ఆరోగ్యం మెరుగు పడిందని వైద్యులు ప్రకటించారు.  

రెస్క్యూ జరిగిందిలా..  
సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆరుగురు గల్లంతవ్వగా.. ఒకే ఒక్క మత్స్యకారుడు చిన్నా మృత్యువుతో 12 గంటల పాటు పోరాడుతూ చైనా షిప్‌లోకి చేరుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. చైనా వాణిజ్య నౌక నుంచి కారి శ్రీనుని తీసుకొచ్చేందుకు నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌ బృందాలు అష్టకష్టాలు పడ్డాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్‌ వద్దకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో హెలికాఫ్టర్‌ సాయంతో చిన్నాను తీసుకొచ్చారు. ఈ దృశ్యాల్ని భారత రక్షణ దళ అధికారులు విడుదల చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement