నేను బతికున్నానంటే నా తమ్ముడు పెట్టిన భిక్షే.. | Heart Wrenching Survival Story, Vizag Fisherman Kare Chinna Reveals How Brother Gave His Life For Him | Sakshi
Sakshi News home page

నేను బతికున్నానంటే నా తమ్ముడు పెట్టిన భిక్షే..

Jul 7 2026 9:27 AM | Updated on Jul 7 2026 10:38 AM

Fisherman Kare Chinna Shocking Comments On Boat Incident

విశాఖపట్నం : ‘నేను బతికున్నానంటే అది కేవలం నా తమ్ముడు పెట్టిన భిక్ష.. నన్ను బతకమని తను మునిగిపోయాడు‘ అంటూ విశాఖ తీరంలో బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భోగాపురం మత్స్యకారుడు కారె చిన్న మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతం కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆ నరకప్రాయమైన రోజు సముద్రంలో ఏం జరిగిందో వివరిస్తూ గుండె పగిలేలా రోదించాడు.  ఆయన మాటల్లోనే.. 

37 మైళ్ల దూరం వెళ్లాం..   
‘మేము జాలై 1వ తేదీన హార్బర్‌ నుంచి వేటకు బయలుదేరి సముద్రంలో సుమారు 30 నుంచి 37 మైళ్ల దూరం లోపలికి వెళ్లాం. రెండు రోజుల పాటు వేట బాగానే సాగింది. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అవుదాం అనుకుంటుండగా.. తీరానికి మరో 10 మైళ్ల దూరం ఉందనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుఫాను గాలులు, రాకాసి అలలు బోటును ముంచెత్తాయి. మేము తేరుకునే లోపే ఒక భారీ అల వచ్చి బోటును బోల్తా కొట్టేసింది. ఆ క్షణంలోనే నా కళ్ల ముందే మా అన్నయ్య కొడుకు (చిన్నయ్య) నీటిలో పడిపోయాడు. మా అన్నయ్య ఏడుస్తూ వెంటనే వాడిని కాపాడటానికి నీళ్లలోకి దూకాడు. అలా వాళ్లిద్దరూ మా కళ్లముందే సముద్రంలో కలిసిపోయారు.

బోటు మునుగుతోంది.. రాత్రంతా ఒకే ఫోర్సు పట్టుకుని కూర్చున్నాం.. 
‘అప్పటికి బోటు పైన మేం ఆరుగురం మిగిలాం. సమయం గడుస్తున్న కొద్దీ రాత్రి 9 గంటల ప్రాంతంలో బోటు నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభమైంది. ‘మనం విడిపోతే ఎక్కడో దగ్గర చచ్చిపోతాం.. రాత్రంతా ఆరుగురం కలిసే ఉందాం’ అని ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నాం. రాత్రంతా సముద్రం మధ్యలో ఆ మునుగుతున్న బోటుపై రెండు లైఫ్‌ బాయ్‌ ఫోర్సులను (రక్షణ వలయాలు) ఆరుగురం గట్టిగా పట్టుకుని తెల్లవార్లూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. కానీ, తెల్లవారేసరికి మాలో ఒక మనిషి కనిపించలేదు. చీకట్లోనే ఎప్పుడు అలల దాటికి కొట్టుకుపోయాడో తెలియదు. అప్పటికి మేం ఐదుగురం మిగిలాం.’ 

కదిలించిన తమ్ముడి త్యాగం! 
‘ఉదయం వెలుతురు వస్తున్న సమయంలో చాలా దూరంలో ఒక చైనా వాణిజ్య నౌక (షిప్‌) వెళ్లడం కనిపించింది. నేను మా తమ్ముడితో అన్నాను.. ‘తమ్ముడూ.. అక్కడ షిప్‌ కనిపిస్తోంది.. ఎలాగోలా ఈదుకుంటూ అక్కడికి వెళ్దాం పదా’ అని పిలిచాను. కానీ నా తమ్ముడు నీరసంగా నా వంక చూసి.. ‘నా ప్రాణం ఇక్కడితో అయిపోయింది, ఇక నా వల్ల ఈదడం సాధ్యం కాదు. నేను రాను. నువ్వు నలుగురు పిల్లలున్న వాడివి.. నా మాట విని నువ్వు వెళ్లు.. ఎలాగోలా బతుకు!’ అని నన్ను బలవంతంగా ముందుకు నెట్టాడు. నా తమ్ముడు నన్ను వెళ్లమన్న ఆ మాట నా గుండెను కోసేసింది. వాడు చెప్పినట్లే మేం నలుగురం ఆ షిప్‌ వైపు ఈదడం ప్రారంభించాం. మేం ఈదుకుంటూ వెళ్తుంటే.. వెనక నుంచి నా తమ్ముడు ’నేను వచ్చేస్తాను.. మీరు వెళ్లండి’ అని ధైర్యం చెప్తూనే ఉన్నాడు. కానీ కొద్దిసేపటికే వాడు కూడా అలల తాకిడికి సముద్రంలో కలిసిపోయాడు.’

15 కిలోమీటర్ల ఈత.. చైనా షిప్‌ లంగర్‌ పట్టుకుని మృత్యుంజయుడిగా.. 
‘నాతో పాటు బయలుదేరిన మిగిలిన ముగ్గురు కూడా మధ్యలోనే అలల వేగానికి కొట్టుకుపోయారు. చివరకు నేను ఒక్కడినే మిగిలాను. దాదాపు 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ ఈదాను. ఎలాగోలా ఆ చైనా షిప్‌ దగ్గరకు చేరుకుని, దాని ‘లంగర్‌’ (యాంకర్‌) గొలుసును గట్టిగా పట్టుకున్నాను. ఆ సమయంలో పెద్ద అల వచ్చి నన్ను కిందకు పడేసింది. చచ్చిపోతాననే భయంతో ’బాబోయ్‌ కాపాడండి.. కాపాడండి..’ అని గట్టిగా కేకలు వేశాను. నా కేకలు విని షిప్‌ పైనున్న చైనా సిబ్బంది కిందికి చూశారు. వెంటనే వారు ఒక లైఫ్‌ జాకెట్, తాడు కిందికి విసిరారు. దాన్ని నడుముకు కట్టుకోగానే నన్ను పైకి లాగారు. నన్ను పైకి తీసుకెళ్లాక దాదాపు రెండు వాటర్‌ బాటిళ్లు తాగాను. ఆ తర్వాత వాళ్లు నాకు బట్టలు ఇచ్చి, భోజనం పెట్టి ఆదరించారు. నౌకాదళ హెలికాప్టర్‌ వచ్చేంత వరకు నేను ఆ చైనా షిప్‌లోనే ఉన్నాను’ అని చిన్న కన్నీరు మున్నీరవుతూ ముగించాడు. 

మిగిలిన వారి కోసం ఉత్కంఠగా గాలింపు 
తమ కళ్లముందే కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఒక్కొక్కరుగా సముద్రంలో కలిసిపోతుంటే ఏమీ చేయలేకపోయానన్న చిన్న ఆవేదన అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం చిన్న ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, మానసిక ఆందోళనలో ఉన్నాడు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన మిగిలిన ఆరుగురి కోసం నౌకాదళ హెలికాప్టర్లు, కోస్ట్‌ గార్డ్‌ బోట్లు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement