మా సమస్యలు తీర్చండి | Field Assistants Protest in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మా సమస్యలు తీర్చండి

Oct 6 2026 5:28 AM | Updated on Oct 6 2026 5:28 AM

Field Assistants Protest in Andhra Pradesh

పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ‘ఉపాధి’ ఫీల్డ్‌ అసిస్టెంట్ల భారీ ధర్నా 

ఉద్యోగ భద్రత కల్పించాలని.. రాజకీయ వేధింపులు ఆపాలని.. కనీస వేతనాలు 

ఇవ్వాలని డిమాండ్‌ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై కూర్చుని 4 గంటలపాటు ఆందోళన

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ (వీబీ జీ రామ్‌ జీ) పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి కమిషనర్‌ కార్యాలయానికి ఉద్యోగులు భారీగా తరలివచ్చారు.

వారిని కమిషనర్‌ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో నడిరోడ్డుపైనే కూర్చుని ఆందోళన నిర్వహించారు. పథకం అమలులో కీలకంగా పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కనీస వేతన నిబంధన అమలు చేయాలని, రాజకీయ కారణాలతో అక్రమ తొలగింపులను నివారించి ఉద్యోగ భద్రత కల్పించాలని, మ్యాన్‌డేస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు 4 గంటలకు పైబడి ఆందోళన కొనసాగించారు. మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారందరికీ ఎఫ్‌టీవో హోదా కల్పించాలని, అర్హత సర్వీసు ఆధారంగా పదోన్నతులు కల్పించాలని, మండల స్థాయిలో అంతర్గత బదిలీలకు వీలు కల్పించాలని నినాదాలు చేశారు. 

నెలల తరబడి కాలయాపన 
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు వినతిపత్రం అందజేయగా.. వీబీ జీ రామ్‌ జీ పథకం అమలులోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని అక్కడే ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ హామీ ఇచ్చారని ఫీల్డ్‌ అసిస్టెంట్లు పేర్కొన్నారు. నెలలు గడిచిపోతున్నాయే తప్ప తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని పల్లె పండగ వంటి ప్రచార కార్యక్రమాల నిర్వహించడంపై ఉండే శ్రద్ధ సిబ్బంది సమస్య పరిష్కారంపై చూపడం లేదని మండిపడ్డారు.  

ఎటూ తేల్చని అధికారులు 
రోడ్డుపై ఆందోళన నిర్వహిస్తుండటంతో పోలీసులు జోక్యం చేసుకుని 20 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రతినిధులతో వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించారు. జిల్లాకు ఒకరు చొప్పున ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రతినిధులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌ చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటల చర్చల అనంతరం కొందరు  అధికారులు నడిరోడ్డుపై ఆందోళన చేస్తున్న పథకం సిబ్బంది వద్దకు వచ్చి ‘మీరు చెబుతున్న సమస్యలన్నీ పరిశీలనలో ఉన్నాయి. 

దాంట్లో చేయగలిగిన వాటిని ప్రభుత్వం చేస్తోంది.  ఆందోళన విరమించాలి’ అని విజ్ఞప్తి చేశారు. అధికారులతో చర్చలు పాల్గొన్న ఉద్యోగ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం ఎప్పటికి చేసేది అధికారులు ఇప్పటికీ చెప్పలేదని సహచరులకు వివరించారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగించాలా.. లేదంటే భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించుకోవాలా అనే అంశంపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు చర్చించుకున్నారు. చివరకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించి తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్టు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement