
అనంతపురం జీజీహెచ్‌లో దారుణం
వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇటీవల వైద్యుల నిర్లక్ష్యంతో రాజేష్ (22), మధు నాయక్ (23) అనే యువకులు మృతి చెందిన ఘటనలు మరువకముందే, మరో విషాదం చోటు చేసుకుంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలోని గాందీనగర్‌కు చెందిన కృష్ణమూర్తి ఆచారి (75) ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుమారుడు రాంగోపాల ఆచారి శుక్రవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు.
ఆక్సిజన్ మీద ఉన్న కృష్ణమూర్తి ఆచారిని పరీక్షించిన వైద్యులు, సిటీ స్కాన్‌కు రెఫర్ చేశారు. కానీ ఆరోజు సిటీ స్కాన్ తీయించకుండా సిబ్బంది నిర్లక్ష్యం చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆచారిని ఎటువంటి ఆక్సిజన్ సపోర్టు లేకుండానే ఎంఎన్‌ఓ కొల్లప్ప సిటీ స్కాన్‌కు తీసుకెళ్లాడు. సిటీ స్కాన్ కోసం వచ్చిన ఆచారిని దాదాపు గంటన్నర పాటు ఆ విభాగం ముందే ఉంచేశారు.
సిఫార్సులతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఆక్సిజన్ అందక కృష్ణమూర్తి ఆచారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి వైఫల్యంతోనే రోగులకందే వైద్యంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలు రావడం గమనార్హం.