విస్తరిస్తున్న విదేశీ టూరిజం | Expanding foreign tourism | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న విదేశీ టూరిజం

Published Sun, Sep 15 2024 5:34 AM | Last Updated on Sun, Sep 15 2024 5:34 AM

Expanding foreign tourism

దేశీయంగా పెరుగుతున్న పర్యాటక, ప్రయాణ ఖర్చులు 

ఫలితంగా విదేశీ టూర్లపై ఆసక్తి చూపుతున్న పర్యాటకులు

గోవా, కేరళ పర్యటనలకు వెళ్లే ఖర్చుతో వియత్నాం, శ్రీలంక, 

థాయ్‌లాండ్, సింగపూర్‌ వంటి దేశాలకు క్యూ కడుతున్న భారతీయులు

విదేశీ పర్యటనలపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఖర్చు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ‘కొన్నిసార్లు మేం దేశీయ పర్యటన కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి మరో రూ.10 వేలకుపైగా ఖర్చు చేసి విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు. ఇక్కడ ఖర్చులతో పోలిస్తే విదేశాల్లో తక్కువే’ అని విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి హేమ అభిప్రాయపడ్డారు. 

ఆదాయ వనరుల్లో వృద్ధి, విమాన ప్రయాణాల కనెక్టివిటీ పెరగడంతో మధ్య తరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలోని 31శాతం మంది మధ్య తరగతి ప్రజలున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని అంచనా. 

ఈ క్రమంలోనే 2027 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌లను అధిగమించి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద విదేశీ (అవుట్‌బౌండ్‌) టూరిజం మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి భారత పర్యాటకుల మార్కెట్‌ విలువ రూ.7.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2019లో రూ.3 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు మరో మూడేళ్లలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్‌గా మారుతుందని భావిస్తున్నారు.   – సాక్షి, అమరావతి

మధ్యప్రాచ్య దేశాల్లో మనోళ్ల సందడి
భారతీయుల్ని మధ్యప్రాచ్య (మిడిల్‌ ఈస్ట్‌) దేశాల పర్యాటక రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ పర్యాటకుల్లో దాదాపు సగం విదేశీ పర్యటనలు ఇక్కడే చేస్తున్నారు. ఆ తర్వాత ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో కొనసాగుతున్నాయి. 

పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్‌ హాలిడే మేకర్‌లలో అతిపెద్ద వనరుగా భారత్‌ మారింది. గోవా, కేరళ వంటి భారతీయ రిసార్ట్‌ గమ్యస్థానాల ధరలతో సమానంగానే వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్‌ వంటి సమీప దేశాల్లో ధరలు కూడా ఉంటున్నాయని టూరిజం ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తిరిగే ఖర్చుకు మరికొంత వెచ్చించగలిగితే విదేశాలకు వెళ్లవచ్చనే అభిప్రాయం భారతీయ పర్యా­టకుల్లో ఎక్కువగా కనిపి­స్తోంది. 

ఇటీవల జపాన్‌ సైతం భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఈ–వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో దుబాయ్‌ సైతం భారతీయ సందర్శకులను అకట్టుకునేందుకు బహుళ ప్రవేశ పర్యాటక వీసాను రూపొందించింది. దక్షిణాఫ్రికా సరళీకృత వీసాను తీసుకొస్తోంది. మలేíÙయా, కెన్యా, థాయ్‌లాండ్, ఇరాన్‌ సహా ఇతర దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అవసరం లేని పర్యటనలు అందిస్తున్నాయి.

231 శాతం పెరుగుదల
అమెరికన్లు 63 రోజులు, బ్రిటిషర్లు 90 రోజులతో పోలిస్తే భారతీయులు కేవలం 30 రోజుల ముందుగానే పర్యటనలు ప్లాన్‌ చేస్తున్నారు. భారతీయులకు సమీప దేశాల ప్రయాణాలకు బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఎంతగానో దోహదపడుతు­న్నాయి. 

ఈ క్రమంలో గతేడాది ఎక్కువ మంది వియ­త్నాం ప్రయాణించినట్టు గూగుల్‌ ట్రెండ్స్‌ చెబుతున్నా­యి. అక్కడ 2019తో పోలిస్తే భారతీయ సందర్శకుల సంఖ్య 231 శాతం పెరిగింది. ఇతర ఆగ్నే­యాసియా దేశాలైనా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేíÙయా రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.

విదేశాలకు పెరుగుతున్న విమానాలు 
ఆ్రస్టేలియా, చైనా, జపాన్‌ వంటి ప్రధాన పోటీదారులను అధిగమించి భారతదేశం ప్రయాణ రంగంలో వేగంగా ముందంజ వేస్తోంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ వృద్ధిలో చెప్పుకోదగ్గ పురోగతితో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. దేశీయ విమాన ట్రాఫిక్‌లో ఏటా 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 

ఈ వృద్ధి రేటు చైనాలో 7.1 శాతం, జపాన్‌ 4 శాతం, ఆ్రస్టేలియాలో 2.6 శాతం ఉండగా.. భారత్‌ ఈ దేశాలను అధిగమించడం విశేషం. ఈ వృద్ధితో విమానయాన రంగంలో బ్రెజిల్, ఇండోనేíÙయాను భారత్‌ వెనక్కి నెట్టింది. ఏటా విమాన సీట్ల సంఖ్యలో 6.9 శాతం వార్షిక వృద్ధి రేటు కనిపిస్తోంది. యూఎన్‌ టూరిజం ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది త్రైమాసికంలో అంతర్జాతీయ ప్ర­యా­ణాలు ప్రీ–పాండమిక్‌ స్థాయిలో 97 శాతానికి చేరింది. 

భారతీయ విదేశీ  టూరిజంలో ఉన్నంత వృద్ధి వేగం మరెక్కడా లేదు. వాస్తవానికి గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. తాజాగా మరో 1,200కి పైగా విమానాల కోసం ఆయా సంస్థలు ఆర్డర్లు పెట్టడం విమాన ప్రయాణాల డిమాండ్‌ను సూచిస్తోంది.

టమాటా పండుగకూ వెళ్లొస్తున్నారు 
టీవీలు, సినిమాల్లో చూపించే విదేశీ నగరాలను చూసేందుకు భారతీయుల్లో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు 2011 తర్వాత స్పెయిన్‌ను సందర్శించే భారతీయులు 40 శాతం పెరిగారు. అక్కడ జరిగే ‘లా టొమాటినా పండుగ’ ( టమాటాలు విసురుకోవడం) ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం కావడంతో ఆ పండుగను చూసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement