తిరుచానూరులో ఘటన
చంద్రగిరి: అమ్మవారి సేవలో వినియోగించే ఏనుగు మావటిపై దాడికి పాల్పడిన ఘటన ఆదివారం తిరుపతి జిల్లా, తిరుచానూరు ఆలయ ఆవరణలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మావటి తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే ఉత్సవాలకు శ్రీనిధి అనే ఆడ ఏనుగుతో పాటు మరో ఏనుగును వినియోగిస్తారు. ఆదివారం ఆలయ ఆవరణలో అమ్మవారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. దీంతో మావటిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ గజరాజును తీసుకుని ఊంజల్‌సేవ మండపానికి చేరుకున్నాడు.
ఉత్సవం ముగిసిన తర్వాత శ్రీనిధిని తీసుకెళ్లేందుకు చంద్రశేఖర్ ప్రయత్నించాడు. అయితే ఆలయ ఆవరణలో భక్తులు రాకపోకలు, శబ్దాలకు భయపడిన శ్రీనిధి ఎంతకీ ముందుకు కదలకపోవడంతో అంకుశంతో ముందుకు నడిపేందుకు యత్నించాడు. దీంతో ఏనుగు ఒక్కసారిగా తొండంతో చంద్రశేఖర్‌పై దాడికి తెగబడింది. తొండంతో పట్టుకుని కిందకు విసిరేసి తొక్కేందుకు యత్నించింది. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో మావటికి తీవ్ర గాయాలు కావడంతో పాటు రక్తపు వాంతులయ్యాయి. అక్కడే ఉన్న సిబ్బంది అతడిని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఏనుగును తరలించారు.


