Fact Check: కట్టకుండానే  కట్టేసినట్లు కలరింగా!? | Sakshi
Sakshi News home page

Fact Check: కట్టకుండానే  కట్టేసినట్లు కలరింగా!?

Published Mon, Jan 1 2024 5:12 AM

Eenadu Ramoji Rao Fake News On Department of Aviation - Sakshi

సాక్షి, అమరావతి : అబద్ధాలు ఆడటంలో ఆరితేరిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు తర్వాతే ఎవరైనా. అవతలి వాళ్లు నవ్వుకుంటారన్న సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ.. నిత్యం వాటినే పారాయణ చేస్తూ తన స్థాయిని తనే బజారుకీడ్చుకుంటున్నారు. తాజాగా.. రాష్ట్రంలో విమానయాన రంగంపై ‘మాటలు మరిచారు.. రెక్కలు విరిచారు’ అంటూ ఎప్పటిలాగే తన సహజసిద్ధ శైలిలో తన విషపుత్రిక ఈనాడులో తన పాండిత్యాన్నంతటినీ రంగరించి రామోజీ విషం కుమ్మరించారు.

ఎందుకంటే.. రాష్ట్రంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తూ పలు నగరాలకు సర్వీసులు పెరుగుతుంటే కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ అసత్యాలతో రాష్ట్ర ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ఆపసోపాలు పడ్డారు. నిత్యం ఇలా అశుద్ధ కథనాలు రాస్తుండబట్టే పత్రిక సర్క్యులేషన్‌ రోజురోజుకీ దారుణంగా పడిపోతోంది. అయినాసరే.. తన బాబును పల్లకీ ఎక్కించేందుకు తన అసత్యాల యజ్ఞాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఈనాడును ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఎలుక తోలును ఎంత ఉతికినా.. ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టిన వాటి సహజ లక్షణం ఎలా కోల్పోవో రామోజీ శైలి కూడా అంతే. ఈనాడు తాజా కథనంలోని వాస్తవాలు ఏమిటంటే.. 

ఎలాంటి అనుమతులు లేకుండా బాబు హంగామా..
భూసేకరణ చేయకుండా, పునరావాసం చేపట్టకుండా, కనీసం పౌర విమానయాన శాఖ, రక్షణ రంగం, పర్యావరణం వంటి ఎటువంటి కీలక అనుమతులు లేకుండానే చంద్రబాబునాయుడు భోగాపురానికి శంకుస్థాపన చేసేశారు. కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు తీసుకుని 2,203.26 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించే విధంగా జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి.. ఒప్పందం కుదుర్చుకునే సమయానికి సేకరించిన భూమి కేవలం 377 ఎకరాలు మాత్రమే.

మిగిలిన భూమి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వమేసేకరించి, 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, కమ్యూనిటీ హాళ్లు వంటివి నిర్మించి మరీ ఈ ప్రభుత్వం ప్రజలను ఆనందంగా తరలించింది. పునరావాసం కోర్టు కేసులు, పర్యావరణంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో వేసిన కేసుల్లో పోరాడి మరీ విజయం సాధించింది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కేంద్రంలో అశోక్‌ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయారు.

అలాగే, విమానయాన రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడంలోనూ విఫలమయ్యారు. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సేఫ్టీ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ శాఖల నుంచి కీలక అనుమతులు సాధించి పనులు మొదలుపెట్టారు. బాబు లాగా అనుమతులు లేకుండా టెంకాయ కొట్టడం కాకుండా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మే 2023లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది.

కర్నూలు ఎయిర్‌పోర్టుదీ అదే కథ..
ఇక కర్నూలు ఎయిర్‌పోర్టుకు కూడా 2017లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు పనులు పూర్తికాకుండానే, ఎన్నికలు వస్తున్నాయంటూ 2019 జనవరిలో హడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కానీ, వాస్తవంగా అప్పటికి రన్‌వే, టెర్మినల్‌ బిల్డింగ్, ఏటీసీ టవర్‌ వంటి కీలక నిర్మాణ పనులేవీ 30 శాతం కూడా పూర్తికాలేదు. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తే ఉన్నప్పటికీ ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక అనుమతులను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్మినల్‌ బిల్డింగ్, ఏటీసీ టవర్, బే పార్క్, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్, నావిగేషన్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్మించింది. ఇందుకోసం ఈ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాక.. కీలకమైన ఏరోడ్రోమ్‌ లైసెన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్, అనుమతులతో పాటు ఎస్‌పీఎఫ్‌ ఫోర్స్‌లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 శాతం పైగా పనులను ప్రస్తుత ప్రభుత్వమే పూర్తిచేయడంతో ఈ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి 2021 మార్చిలో ప్రారంభించింది.

తెట్టు వద్ద ఎయిర్‌కార్గో హబ్‌..
ఇక గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరుకు సమీపంలో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రతిపాదిస్తే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో తెట్టు వద్ద ఎయిర్‌పోర్టును నిర్మించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు అనువుగా ఉండేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. ఎయిర్‌ కార్గొ హబ్‌గా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం చేపట్టింది. త్వరలో అనుమతులన్నీ రాగానే పనులు మొదలుపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

కొత్త నగరాలతో అనుసంధానం..
ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం అనేక కొత్త నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ పెరిగితే సర్వీసులు తగ్గిపోయాయి రెక్కలు విరిచేశారు అంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. నిజానికి.. కోవిడ్‌ దెబ్బతో ట్రూజెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా తీయగా, స్పైస్‌జెట్‌ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను తగ్గించుకున్నాయి. చివరకు ఎయిర్‌ ఇండియా కూడా నష్టాలను భరించలేక టాటాలకు అప్పగించేసింది. ఇలా కోవిడ్‌ దెబ్బతో విమాన సర్వీసులు తగ్గితే దానికి కూడా సీఎం జగన్‌ కారణమనడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప మరేమీ కాదు.

అలాగే, విశాఖపట్నం నుంచి గత ప్రభుత్వంలో లేని జైపూర్, గోవా, కడప, కోల్‌కత, తిరుపతిలకు కొత్త సర్వీసులు ప్రారంభమైన మాట రామోజీకి తెలియదనుకోవాలా లేక తెలిసినా తెలీనట్లు నటిస్తున్నారని అనుకోవాలా? అలాగే.. విజయవాడ నుంచి షిర్డీ, విశాఖ, షార్జాలకు, తిరుపతి నుంచి బెల్గాం, గుల్బర్గా, షివమొగ్గలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

అంతేకాదు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా డిమాండ్‌ ఉన్న షార్జాకు నేరుగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా సర్వీసులను నడుపుతోంది. అదే విధంగా దుబాయ్, బెహ్రెయిన్, కువైట్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్‌లకు నేరుగా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీంతోపాటు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్‌ దేశాలకు.. ఆస్ట్రేలియా, యూరప్‌లకు విమాన సర్వీసులు నడపడానికి సంప్రదింపులు జరుపుతోంది.

రూ.20వేల కోట్లతో తీరప్రాంత అభివృద్ధి..
కేవలం ఎయిర్‌పోర్టులే కాకుండా ప్రతీ 50 కి.మీ.లకు పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఉండే విధంగా పెద్దఎత్తున తీరప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్లు వెచ్చిస్తోంది.

విమానాశ్రయాల అభివృద్ధి..
మరోవైపు.. రాష్ట్రంలో మొత్తం ఏడు విమానాశ్రయాలు ఉండగా అందులో విశాఖతో కలిపి అయిదింటిని ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తోంది. 
► కర్నూలు ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం, పుట్టపర్తిని శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. 
► రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాల్లో భారీ విమానాలు దిగేందుకు అనుకూలంగా రన్‌వేలను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్‌ బిల్డింగ్‌లను నిర్మిస్తోంది. 
► రాజమండ్రి విమానాశ్రయాన్ని రూ.350 కోట్లతో విస్తరణ పనులకు ఇటీవలే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా శంకుస్థాపన చేశారు. 
► అదే విధంగా.. కడప విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడంతోపాటు రూ.450 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 
► అలాగే, విజయవాడ టెర్మినల్, రన్‌వే విస్తరణ పనులు దాదాపు పూర్తయి కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. 
► తిరుపతి విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో పాటు అక్కడ విమానాలను రిపేర్‌ చేసే విధంగా ఎంఆర్‌ఓ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్నారు. 
► కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలెట్‌ శిక్షణా కేంద్రంతో పాటు ఏరోస్పోర్ట్స్‌ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. 

విమాన ప్రయాణికుల వృద్ధి ఇలా.. 

Advertisement

తప్పక చదవండి

Advertisement