FactCheck: అదంతా ‘పచ్చ’ అబద్ధం! 

Eenadu journalist is writing false stories with political malice - Sakshi

రాజకీయ దురుద్దేశంతో అసత్య కథనాలు రాస్తున్న ఈనాడు విలేకరి 

పెదకూరపాడు టీడీపీ నేతల ప్రోద్బలంతో నిత్యం అబద్దాల వార్తలు 

ఇసుక రవాణా నిలిపివేసినా అక్కడున్న వాహనాల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ 

దానిపై ప్రశ్నిస్తే తనపై దాడి చేశారంటూ అసత్య ఆరోపణలు 

దానికి మరింత మసాలా జోడించి ఈనాడులో పతాక శీర్షిక ప్రచురణ 

సాక్షి, అమరావతి: నిత్యం కట్టుకథలతో పేజీలకు పేజీలు నింపేస్తున్న ఈనాడు పత్రిక గురువారం మరో అబద్దాన్ని అందంగా అచ్చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల పోద్బలంతో అక్కడి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్న అమరావతి ఈనాడు విలేకరిపై ఏకంగా పెట్రోల్‌పోసి నిప్పంటించేస్తామని బెదిరించి... చంపబోయారన్నట్టు... ఓ అబద్దపు వార్త ప్రచురించింది.

వాస్తవానికి ఆ విలేకరి పీడీయాక్ట్‌పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన టీడీపీ నేత దండా నాగేంద్రతో సన్నిహితంగా ఉంటూ అతను చెప్పినట్టు ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. అక్రమాలకు పాల్పడుతున్న ఆ విలేకరిని వేరే పత్రిక తొలగిస్తే టీడీపీనేత దండా సిఫార్సుతో ఈనాడులో కొన్నాళ్ల క్రితం చేరాడు.

అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్న నాగేంద్రం సూచనమేరకు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు.  

ఇసుక ర్యాంపులోకి అక్రమంగా... 
అమరావతి మండలం మల్లాది ఇసుకరీచ్‌ను పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి మంగళవారం స్వయంగా పరిశీలించారు. కానీ తవ్వకాలు ఆపమని బుధవారానికి ఎటువంటి ఆదేశాలు రాకపోవటంతో యథావిధిగానే ఇసుక  తవ్వకాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థాయి అధికారులు ఉదయం 10.30గంటలకు వచ్చి తవ్వకాలు ఆపేయాలని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడింగ్‌ చేయటానికి నిర్వాహకులు బిల్లులు రాశారు, ఇంకా బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనక్కు పంపారు.

బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలతో ఇసుక పంపించేశారు. అదే సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్‌ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్‌ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో “ఏంటబ్బాయ్‌ ఫొటోలు, వీడియోలు తీస్తున్నావు... గతంలో కూడా ఇలాగే ఫొటోలు తీసి నిజాలు దాచిపెట్టి అబద్దాలు రాసి మన ఊరి పరువుతీస్తున్నావ’ని సరదాగా అన్నారు.

దానికి ఆయన “నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్‌ తీసుకుని రీచ్‌లోకి రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్‌ చేయిస్తాను’ అంటూ దురుసుగా మాట్లాడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఈనాడు కంట్రిబ్యూటర్‌ కవ్వింపు చర్యలకు దిగడంతో తోపులాట జరిగింది. వెంటనే ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్‌ అధికారి రాంబాబు వారిని విడదీసి కంట్రిబ్యూటర్‌ను ద్విచక్ర వాహనంపై పంపించేశారు. కిందపడిపోయిన ఆయన సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం ద్వారా అప్పగించారు. 

ఈనాడులో వచ్చింది అబద్ధం 
జరిగిన సంఘటన ఒకటైతే... ఈనాడు పత్రికలో వేరేవిధంగా వార్త వచ్చిందని ఇసుక కంపెనీ విజిలెన్స్‌ అధికారి రాంబాబు మీడియాకు తెలిపారు. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఈనాడు కంట్రిబ్యూటర్‌ ఇసుక రీచ్‌లోకి ప్రవేశించడమే గాకుండా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగాడనీ ఆ సమయంలో “పెట్రోల్‌ తీసుకురండి.. తగలెట్టేద్దాం’ అని ఎవరూ అనలేదని, అసలు నిర్బంధించలేదని చెప్పారు.

ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్‌సీపీ అనిగానీ, ఎమ్మెల్యే శంకరరావు పేరుగానీ ప్రస్తావించకపోయినా ఈనాడులో తప్పుడు కథనాలు ప్రచురించారని తెలిపారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ వచ్చి పరామర్శించి, రాజకీయ రంగు పులిమారనీ పేర్కొన్నారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో కంట్రిబ్యూటర్‌ గుంటూరు ఈనాడు కార్యాలయానికి వెళ్లాక, అక్కడ కట్టు కథ అల్లి అడ్డగోలుగా వార్త ప్రచురించినట్టు స్పష్టమైంది. 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top