
రాష్ట్రంలో అగమ్యగోచరంగా ‘ఉన్నత విద్య’
ఫలితాలు వచ్చిన నెలన్నర తర్వాత ఈసెట్ కౌన్సెలింగ్
జూన్ 30 నుంచే ప్రారంభమైన బీటెక్ సెకండియర్ తరగతులు
కానీ, జూలై 4 నుంచి కౌన్సెలింగ్ చేపట్టనున్న ప్రభుత్వం
మంత్రి అవగాహన రాహిత్యంతో ఆ శాఖ అప్రతిష్టపాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ‘ఉన్నత విద్య’ అగమ్యగోచరంగా తయారైంది. విద్యా సంవత్సరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. వివిధ కోర్సుల ప్రవేశాల నిర్వహణలో తీవ్ర జాప్యంచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ అవగాహన రాహిత్యం ఉన్నత విద్యాశాఖకు శాపంగా మారింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఈసెట్ ప్రవేశాలను బీటెక్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయడం సర్కారు చేతగానితనానికి అద్దంపడుతోంది.
అభాసుపాలవుతున్న మంత్రి..
టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖ మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నా మంత్రికి పట్టడంలేదు. అసలు ఉన్నత విద్యాశాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని దుస్థితిలో ఆయనున్నారు. ఫలితంగా విద్యా వ్యవస్థలోని కీలక అంశాలు మరుగునపడుతున్నాయి. పగలంతా సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకుని సాయంత్రం వేళల్లో సమీక్షల పేరుతో అధికారులతో టీ, బిస్కెట్ల మీటింగ్ పెట్టి మమ అనిపిస్తున్నారు.
ఏడాది కాలంగా మంత్రి లోకేశ్ సమీక్షల్లో ప్రతిపాదించిన అంశాల్లో ఏ ఒక్కదానిలో పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య మంత్రి లోకేశ్ ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తట్టుకోలేక అభాసుపాలవుతున్నారు. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్ విషయంలోనూ మంత్రి ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడం ద్వారా ఆయన అవగాహన రాహిత్యం బయటపెట్టింది.
సెకండియర్ క్లాసులు మొదలయ్యాక కౌన్సెలింగ్..
ఇక ఏటా ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది. ఇందులో డిగ్రీ, ఇంజనీరంగ్, బీఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు, తరగతుల నిర్వహణ, పరీక్షల తేదీల వంటి అంశాలను సమగ్రంగా పొందుపరుస్తుంది. ఈ క్రమంలోనే బీటెక్ రెండో ఏడాది తరగతులను జూన్ 30 నుంచి ప్రారంభించాలని పేర్కొంది. కానీ, బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ ద్వారా చేరే ఈసెట్ విద్యార్థులను మాత్రం విస్మరించింది. మే 15న ఈసెట్ ఫలితాలు విడుదలైతే.. నెలన్నర తర్వాత జూలై 4 నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇచ్చింది.
వాస్తవానికి.. ఈసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించకుండానే బీటెక్ రెండో ఏడాది తరగతుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించడంతో విద్యార్థులను ఆందోళనలో పడేసింది. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్‌కు జూలై 4 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి, 7 నుంచి ఆప్షన్ల ఎంపిక అనంతరం 14లోగా సీట్ల భర్తీని పూర్తిచేసేందుకు షెడ్యూల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది తొలిదశ కౌన్సెలింగ్ కాగా.. ఆ తర్వాత మరోదశ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి జూలై ముగిసిపోతుంది. ఫలితంగా విద్యార్థులకు ఒకనెల తరగతులు కోల్పోవాల్సి వస్తోంది. అసలు ఇంజినీరింగ్ సెకండియర్ తరగతులు మొదలయ్యే తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశాలను పూర్తిచేయాల్సి ఉండగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తూ విమర్శలపాలవుతోంది.