'సంక్షేమ' వ్యయాలను నిర్దేశించలేరు

Dushyant Dave reported to high court On behalf of Andhra Pradesh Govt - Sakshi

ఆదాయ, వ్యయాల వ్యవహారాలన్నీ ప్రభుత్వ పరిధిలోనివి.. ఇందులో కోర్టుల జోక్యం తగదు

హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే

విచారణ గురువారానికి వాయిదా

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఉండాలి.. వాటికి ఎలా ఖర్చు చేయాలన్న విషయాలను న్యాయస్థానాలు నిర్దేశించజాలవని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఆదాయ, వ్యయాల వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వాల పరిధిలోని అంశాలని తెలిపారు. ప్రభుత్వ ఆదాయాలన్నీ సంచితనిధికే వెళతాయని వివరించారు.

ఆదాయాలను సంచితనిధిలో జమ చేయకుండా ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)కు బదలాయిస్తున్నామంటూ పిటిషనర్‌ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకే ఏపీఎస్‌డీసీని తీసుకొచ్చారని వివరించారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం తగదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అయితే ఆ తీర్పుల కాపీలు తమ ముందుకు రాకపోవడంతో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీఎస్‌డీసీ చట్టంలోని సెక్షన్‌ 12(1)(4), (5)లను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది యజమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ, ఆదాయాలను సంచితనిధిలో జమ చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

రూ.25వేల కోట్ల రుణం కోసం విశాఖపట్నంలోని ప్రభుత్వ భూములు, భవనాలను తనఖా పెట్టేందుకు వీలుగా వాటిని ఉచితంగా ఏపీఎస్‌డీసీకి బదలాయిస్తోందని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ వాదనలను తోసిపుచ్చారు. ఆదాయ, వ్యయాల విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందన్నారు. చట్ట ప్రకారం చేసే వ్యయాలపై ఆడిట్‌ ఉంటుందని తెలిపారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top