విచారణకు తీసుకువెళ్తే..కిడ్నాప్‌ అంటూ ఎల్లోమీడియా తప్పుడూ కథనాలు

Duddukunta Sridhar Reddy Criticized Yellow Media Spreading Wrong News - Sakshi

సాక్షి, పుట్టపర్తి టౌన్‌: కేసు విచారణ నిమిత్తం ఓ నిందితు డిని పోలీసులు తీసుకెళ్తే ఆ విషయంలో తన అనుచరుల హస్తం ఉందని, ఆ వ్యక్తిని కిడ్నాప్‌ చేశారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పచ్చ పత్రికలతో కలిసి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. శనివారం పుట్టపర్తిలోని వైఎస్సార్‌ సీపీ కార్యాయలంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమాడ మండలానికి చెందిన చెరువు నరేంద్రరెడ్డి అనే వ్యక్తిని గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసుల ప్రత్యేక బృందం విచారణ నిమిత్తం తీసుకెళ్లిందన్నారు. అయితే, సదరు వ్యక్తిని తన అనుచరులు కిడ్నాప్‌ చేశారని, ఎమ్మెల్యే హస్తం ఉందని ఓ పచ్చ పత్రికలో వచ్చిందన్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పత్రికపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకు సాగుతుండడాన్ని చూసి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. రూ. 6 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 193 చెరువులు నింపేందుకు చర్యలు తీసుకున్నామని, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు.

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో మండలానికి 200 ఇళ్లు మంజూరు చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక నిరుపేదల కోసం 25 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అడ్డదారుల్లో రాజకీయం చేయడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం పల్లె రఘునాథరెడ్డికే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగణంగా పనిచేస్తూ, సత్యసాయి బాబా కలలు కన్న బంగారు పుట్టపర్తిని తీర్చిదిద్దుతున్న తమపై అభాండాలు వేయడం హేయమన్నారు. ప్రజలకన్నీ తెలుసని, వారే మళ్లీ టీడీపీ నేతలకు బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ మాధవరెడ్డి, జిల్లా అగ్రీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌ రమణారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి కేశప్ప,  మున్సిపల్‌ చైర్మన్‌ తుంగ ఓబుళపతి, వైస్‌ చైర్మన్‌ తిప్పన్న, పట్టణ కన్వీనర్‌ రంగారెడ్డి, కౌన్సిలర్‌ చెరువుభాస్కర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ నారాయణరెడ్డి, నాయకులు సాయి, కడపరాజా తదితరులు పాల్గొన్నారు.  

కిడ్నాప్‌ వార్త వదంతే 
నల్లమాడ: మండలంలోని చెరువువాండ్లపల్లికి చెందిన నరేంద్రరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని సీఐ నిరంజన్‌రెడ్డి శనివారం తెలిపారు. నరేంద్రరెడ్డితో పాటు గుప్త నిధుల తవ్వకంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డిని కూడా అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top