డీఎస్సీ అభ్యర్థులకు గడువు గుబులు | DSC online exams begin from Friday | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులకు గడువు గుబులు

Jun 5 2025 3:15 AM | Updated on Jun 5 2025 3:15 AM

DSC online exams begin from Friday

90 రోజులన్నారు.. 45 రోజుల్లోనే కానిస్తున్నారు

అభ్యర్థులకు 3 నెలల శిక్షణ సమయం ఇస్తామన్న సర్కారు

ఇప్పుడు 45 రోజుల్లోనే పరీక్ష పెడుతున్న వైనం

చివరి దాకా ప్రయత్నించినా మారని ఎగ్జామ్‌ షెడ్యూల్‌

ఆందోళనలో 3,35,401 మంది అభ్యర్థులు

రేపటి నుంచి యథావిధిగా పరీక్షలు

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో ఊరించి ప్రకటించిన డీఎస్సీ పరీక్షలు ఉపాధ్యాయ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నోటిఫికేషన్‌ తర్వాత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్‌ పూర్తిగాక పరీక్షార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. 

ఇది నమ్మి ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులను షాక్‌కు గురిచేస్తూ మరుసటి రోజే మెయిన్స్‌ నిర్వహించారు. దీంతో వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కూటమి సర్కారు డీఎస్సీ పరీక్షలకూ అనుసరించింది. దీంతో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 3,35,401 మంది సిలబస్‌ పూర్తిగాక, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన 6100 పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మెగా డీఎస్సీ ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం అభ్యర్థులకు హామీ ఇచ్చింది. 

అలాగే సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్‌పై చేశారు. అంతేగాక, వెంటనే నోటిఫకేషన్‌ ఇచ్చి డిసెంబర్‌లో పోస్టింగ్స్‌ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఆ తర్వాత పలు రూపాల్లో వాయిదాలపై వాయిదాలతో సుమారు ఏడాదిదాకా సాగదీశారు. 

అంధకారంలోకి అభ్యర్థుల జీవితాలు 
ఇంతగా కాలయాపన చేసిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్‌ ఇచ్చి అనేక మెలికలు పెట్టింది. ప్రధానంగా 50 శాతం అర్హత మార్కుల నిబంధన విధించి 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అర్హతను నిర్దయగా కోల్పోయేలా చేసింది. 50 శాతం మార్కుల అర్హత పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టింది. ఎస్జీటీ నుంచి పీజీటీ పోస్టుల వరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థుల అర్హత మార్కులను 45 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు.

టెట్‌ అర్హత మార్కుల ప్రకారం ఈ మార్పు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఇదే వరుసలో ఉన్న జనరల్‌ అభ్యర్థుల అర్హత కనీసం మార్కులను మాత్రం 50 శాతం అలాగే ఉంచారు. వాస్తవానికి టెట్‌కు జనరల్‌ అభ్యర్థుల అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆమేరకు మార్పు చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్‌ను, ఆశలను అంధకారంలోకి ప్రభుత్వం నెట్టేసింది.

గతంలో జరిగిన డీఎస్సీ పరీక్షలకు ఇలాంటి నిబంధనలు లేవు. కేవలం కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన డీఎస్సీ–2025లోనే ఈ పరిస్థితి తీసుకురావడం ఉద్దేశపుర్వకంగానే చేశారని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. టెట్‌ రాసేటప్పుడే ఈ నిబంధన విధించి ఉంటే సమస్య ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం తమ భవిష్యత్‌ను నాశనం చేసిందని వాపోతున్నారు.  

ప్రణాళికాబద్ధంగా మోసం
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులనూ భర్తీ చేస్తామని, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం గతేడాది జూన్‌ నెలలో ప్రకటించింది. అనంతరం అదే సమయంలో డీఎడ్, బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాలని జూలై నెలలో టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రచారం చేశారు. దీనిప్రకారం ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్‌ రావాలి. 

తర్వాత టెట్‌కు, డీఎస్సీకి మధ్య 3 నెలల వ్యవధి ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన టెట్‌ ను అక్టోబరులో జరిపిన ఫలితాలను ప్రకటించారు. టెట్‌ పూర్తయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి మూడు నెలల్లో పరీక్షలు పెట్టాలి. కానీ తొలుత నవంబర్‌ 3న డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 

తర్వాత 6వ తేదీన నోటిఫికేషన్‌ అన్నారు. ఆరు నెలలుగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. నోటిఫికేషన్‌ ప్రకటించే ఒక్కరోజు ముందు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి నివేదిక వచ్చాక నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement