హెచ్‌ఎంపీవీపై ఆందోళన వద్దు | Do not worry about HMPV | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంపీవీపై ఆందోళన వద్దు

Jan 6 2025 5:27 AM | Updated on Jan 6 2025 5:37 AM

Do not worry about HMPV

రాష్ట్రంలో ఎక్కడా ఆ కేసులు లేవు

కరోనా తరహా ముందస్తు జాగ్రత్తలతో వ్యాప్తిని నిరోధించవచ్చు

రాష్ట్ర వైద్యశాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: చైనాలో గుర్తించిన హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) పట్ల రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇప్పటివరకూ దేశం, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి కేసులు  వెలుగు­చూడలేదని వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ వైరస్‌ కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని తెలిపింది.  

చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. వైరస్‌ సోకిన వ్యక్తుల నోటి నుంచి వెలువడే తుంపర్లు, ఇతరులతో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని పేర్కొంది. ఇక వైరస్‌ సోకిన 3–10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని తెలిపింది. 

ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వారికి నిర్దిష్టమైన యాంటీ వైరల్‌ చికిత్సలేదని.. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదని, ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్‌ థెరపీ చేపడతారని ఆరోగ్యశాఖ ఆ ప్రకటనలో వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

వైరస్‌ లక్షణాలు
దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలుంటాయి. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్‌ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
» 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా చేసుకోవాలి.
»  తుమ్మినా, దగ్గినా నోరు, ముక్కుకు రుమాలును అడ్డుపెట్టుకోవాలి. 
»  రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. 
»  తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవడంతో పాటు, నిద్రపోవాలి.
»  వైరస్‌ లక్షణాలు కన్పించిన వెంటనే క్వారంటైన్‌లో ఉండాలి. 
» లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement