డిజిటల్‌ పాఠాలతో సత్ఫలితాలు

Digital Teaching that continued with AP Govt actions throughout the Corona period - Sakshi

కరోనా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కొనసాగుతున్న బోధన

సప్తగిరి చానల్, ఆకాశవాణిల ద్వారా పిల్లలకు పాఠాలు 

డిజిటల్‌ పరికరాలు ఉన్నవారికి ఆన్‌లైన్‌ వీడియోలతో బోధన  

సదుపాయాలు లేని వారికి మొబైల్‌ పాఠశాలల ఏర్పాటు

విద్యార్థుల సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌ 

సాక్షి, అమరావతి: కరోనాతో పాఠశాలలు తెరుచుకోలేని పరిస్థితుల్లో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు వారి వద్దకే బోధనా కార్యక్రమాలు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 72 లక్షల మంది విద్యార్థుల్లో 56 శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో చదువులు కొనసాగేలా డిజిటల్‌ బోధనను దేశంలోని ఏ రాష్ట్రమూ చేపట్టక ముందే దూరదర్శన్‌ (సప్తగిరి చానల్‌), ఆకాశవాణిల ద్వారా విద్యామృతం, విద్యాకలశం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ బోధన చేపట్టింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచనలు పాటిస్తూ హైటెక్, నోటెక్, లోటెక్‌ అని విద్యార్థులను మూడు రకాలుగా వర్గీకరించి హైటెక్‌ వారికి ఆన్‌లైన్‌ పద్ధతిలో, లోటెక్‌ వారికి దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా, నోటెక్‌ వారికి మొబైల్‌వ్యానుల ద్వారా బోధన జరిగేలా చూస్తున్నారు. 

పెరిగిన చానల్‌ రేటింగ్‌..
► లాక్‌డౌన్‌ ప్రారంభంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఉన్న 18.32 లక్షల మంది విద్యార్థులకు వర్క్‌బుక్స్‌ అందించి బ్రిడ్జి కోర్సులను చేపట్టారు.  
► ఒకటి నుంచి పదో తరగతి వరకూ అభ్యాసం కోసం 63 కొత్త వర్క్‌బుక్‌లను రూపొందించి ఈ దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా బోధన కొనసాగిస్తున్నారు.  
► వీడియోలు ముందుగానే రూపొందించి నిపుణులైన టీచర్లతో బోధన చేయించారు.  
► సప్తగిరి చానల్‌ ద్వారా ప్రసారమవుతున్న పాఠాలను లక్షలాది మంది విద్యార్థులు వీక్షిస్తుండంతో ఆ చానల్‌ టీఆర్పీ రేటింగ్‌ పెరిగి దూరదర్శన్‌ చానళ్లలో రెండోస్థానంలో నిలిచిందని విద్యాశాఖవర్గాలు పేర్కొన్నాయి. 
► ‘1800123123124’ టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి నిపుణులైన టీచర్ల ద్వారా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. 
► కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్న వారికి అభ్యాస యాప్‌ ద్వారా కూడా బోధనా వీడియోలను అందుబాటులో ఉంచారు. 
► మొబైల్‌ వాహనాల ద్వారా పిల్లలకు వారి గ్రామాల్లోనే ఆసక్తికరమైన రీతిలో పాఠ్యబోధనకు ఏర్పాట్లు చేశారు. 
► విద్యార్థులు, టీచర్ల ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యం పెంపు కోసం వెబినార్‌ ద్వారా ఆన్‌లైన్‌ సదస్సులు నిర్వహించారు. 1.5 లక్షల టీచర్లు ఈ శిక్షణలో పాల్గొనడం విశేషం. 
► దేశంలో ఈ రకమైన శిక్షణ ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు పొందింది.  
► ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకే కాకుండా మొత్తం అన్ని స్కూళ్ల కోసం కార్యక్రమాలను రూపొందించారు.

దూరదర్శన్‌ పాఠాలతో విద్యార్థులకు మేలు 
దూరదర్శన్‌ ద్వారా పాఠశాల విద్యాశాఖ ప్రసారం చేస్తున్న పాఠాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఈ పాఠాలు వింటూ విద్యార్థులు తమ వర్క్‌బుక్‌ల ద్వారా వాటిని పునశ్చరణ చేస్తూ కరోనా కాలంలో పాఠశాలలు లేకపోయినా విజ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. పాఠాలు కూడా రొటీన్‌గా కాకుండా ఎంతో ఆసక్తిని కలిగించేవిగా ఉండటంతో విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. 
– పైడిరాజు, హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూల్, గిడిజాల, విశాఖపట్నం జిల్లా 

పాఠాలు ఆకట్టుకునేలా ఉన్నాయి 
నేను పదో తరగతిలోకి వచ్చాను. పాఠశాలలు లేకపోవడం వల్ల మా చదువులు ఆగిపోకుండా ప్రభుత్వం దూరదర్శన్‌ ద్వారా ప్రసారం చేయిస్తున్న కార్యక్రమం వల్ల మాకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గణితం, సైన్సు వంటి సబ్జెక్టులపై గ్రాఫిక్స్‌తో కూడిన పాఠ్యాంశాలు మాకు బాగా అర్థమయ్యేలా వీడియోల రూపంలో చూపిస్తుండడంతో పాఠాలపై ఆసక్తి పెరుగుతోంది. 
– రమ, పదో తరగతి, గిడిజాల 

సులభంగా అర్థమయ్యేలా బోధన 
పిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు ఎలా బోధిస్తామో అంతకన్నా సులభంగా అర్థమయ్యేలా దూరదర్శన్‌ ద్వారా బోధిస్తున్నాం. విద్యావారథి కింద పిల్లలకు హిందీ పాఠ్యాంశాలను బోధిస్తున్నాను. 
– లంకా వెంకటరమణ, హిందీ టీచర్, జెడ్పీ హైస్కూల్, వానపాముల, కృష్ణాజిల్లా 

నిపుణులతో బోధన 
1 నుంచి 10వ తరగతి వరకు విద్యావారథి కింద దూరదర్శన్‌లో ఆసక్తికరమైన రీతిలో ఆయా పాఠ్యాంశాలను తీర్చిదిద్దాం. టీచర్లలో నిపుణులైన వారిని ఎంపిక చేసి వారికి ముందుగానే పాఠ్యప్రణాళిక ఇచ్చి దూరదర్శన్‌ ద్వారా  బోధన కొనసాగిస్తున్నాం. హైస్కూల్‌ స్థాయిలో బోధనకు పలు సాంకేతిక ఉపకరణాలను వినియోగిస్తున్నాం.  
  –  డా. ప్రతాప్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top